బ్రిటిష్ పాప్ మ్యూజిక్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. పాపులర్ ‘ది వాంటెడ్’ మ్యూజిక్ బ్యాండ్ మెంబర్ గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ గాయకుడు, సింగర్ టామ్ పార్కర్ ఇక లేరు. బ్రెయిన్ ట్యూమర్ తో రెండేళ్లపాటు పోరాడిన తర్వాత టామ్.. బుధవారం (మార్చి 30న) తన కుటుంబ సభ్యుల సమక్షంలోనే కన్ను మూసినట్లు తెలుస్తుంది. ఈ బాధాకరమైన విషయాన్ని టామ్ భార్య కెల్సీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
కేవలం 33 ఏళ్ల వయస్సులోనే టామ్ మరణించడంతో వాంటెడ్ బ్యాండ్ సభ్యులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టెర్మినల్ బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా టామ్ చనిపోయినట్లు అతని భార్య కెల్సీ హార్డ్‌విక్ ఇన్‌స్టాగ్రామ్ లో ప్రకటించింది.
భర్త మృతితో ఎమోషనల్ అయిన కెల్సీ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. “టామ్ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే శాంతియుతంగా కన్నుమూశాడు. టామ్ ఇక లేడనే వార్త మా హృదయాలను కలచివేస్తోంది. చివరి వరకు క్యాన్సర్ తో స్ట్రాంగ్ గా పోరాడాడు. టామ్ లేని లైఫ్ ఊహించలేకపోతున్నాం. కానీ టామ్ భార్యగా ఎల్లప్పుడూ గర్విస్తాను. ఇన్నేళ్ళుగా టామ్ ని, నన్ను అభిమానిస్తూ సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి నా కృతజ్ఞతలు” అని తెలిపింది.
ఇక టామ్ కి భార్య కెల్సీతో పాటు మూడేళ్ళ కూతురు అరేలియా రోజ్, కొడుకు బోధి ఉన్నారు. అయితే.. టామ్ కి బ్రెయిన్ కాన్సర్ నిర్దారణ అయినట్లు 2020 అక్టోబర్ లోనే ప్రకటించాడు. అప్పటికే క్యాన్సర్ ముదిరి స్టేజి 4కి చేరుకునే సరికి వైద్యులు కూడా 12 నెలలు మాత్రమే బతుకుతాడని చెప్పినట్లు కుటుంబ సభ్యులు, బ్యాండ్ మెంబర్స్ తెలిపారు. ఇక టామ్ పాడిన పాటల్లో ‘గ్లాడ్ యూ కేమ్’ మంచి పేరు తీసుకొచ్చింది.