మావోయిస్టు లో పార్టీలో కీలక వ్యక్తిగా పేరు తెచ్చుకున్న మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ 1977లో అజ్ఞాతంలోకి వెళ్లి మావోయిస్టు అగ్రనేతగా మారారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి (70) కన్నుమూశారు. రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఈ నేపథ్యంలోనే ఆయన కన్నుమూసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాకపోతే మావోయిస్టు పార్టీ కానీ ఇటు పోలీసులు కానీ రాజిరెడ్డి మృతి పై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మల్లారెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి. యుక్త వయసులోనే ఆయన పార్టీలోకి వెళ్లారని.. ప్రస్తుతం ఆయన వయసు 70 సంవత్సరాలు అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. మల్లా రాజిరెడ్డి ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా దండకారణ్యంలో కీలకంగా పనిచేశారు. కాగా, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ అలోక్ అలియాస్ సాయన్న అలియాస్ మీసాలన్న అలియాస్ అలియాస్ దేశ్ పాండే అలియాస్ గోపన్న ఇలా ఎన్నో పేర్లతో ఆయన పలు పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు.. రాజిరెడ్డి ని పట్టించిన వారికి కోటిరూపాయ నజరానా ప్రకటించింది ప్రభుత్వం. 1975లో ఆయన ఆర్ఎస్‌యూలో చేరారు. ఆ తర్వాత కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులై పీపుల్స్ పార్టీలో చేరారు.
1977 లో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి మంథని, మహదేవ్‌పూర్ ఏరియా దళ సభ్యునిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. వ్యూహాలు పన్నడంలో రాజిరెడ్డి అందెవేసిన చేయి అని.. పలు మార్లు పోలీసు దాడుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారని చెబుతుంటారు. 2007లో పక్కాసమాచారంతో కేరళలోని అంగన్ మలై ప్రాంతంలో పోలీసులు ఆయనను పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, మంథని కోర్టులో హాజరు పరిచి 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు నెలల జైలు శిక్ష తర్వాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజిరెడ్డి మృతిపై వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన మృతిపై మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు.