టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు తమన్. మిగతా హీరోలతో పోలిస్తే.. బాలయ్య సినిమాలకు తమన్ అందించే సంగీతం, బీజీఎం.. వేరే లెవల్ ఉంటాయి. ఇక అఖండ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ ఏరేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ ఏడాది.. బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి సినిమాకు కూడా తమనే సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సాధించింది. సినిమా విజయానికి తమన్ అందించిన మ్యూజిక్ కూడా ప్రధాన కారణం అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. వీర సింహా రెడ్డి.. అన్ని ఏరియాల్లో.. బ్రేక్ ఈవెన్ వసూళ్లు సాధించి.. మాసీవ్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం.. ఆదివారం వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమన్.. మరోసారి బాలయ్య మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఏకంగా బాలయ్యను శివుడితో పోల్చాడు తమన్. ఆ వివరాలు..
‘వీర సింహా రెడ్డి’ సినిమా విడుదలైన తర్వాత ఓ ఇంటర్వ్యూలో తెలుగు రాష్ట్రాల్లో ‘గోవిందా గోవిందా…’ జపం తర్వాత మనం ఎక్కువ వినేది ‘జై బాలయ్య…’ అంటూ ప్రశంసలు కురిపించిన తమన్.. మరోసారి బాలయ్యపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. అఖండ సినిమా టైం నుంచి బాలయ్యను శివుడిలా చూస్తున్నాను అన్నాడు తమన్.
ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ.. ‘‘నేను ‘అఖండ’ సినిమా నుంచి బాలకృష్ణను శివుడిలా చూస్తున్నాను. నా జీవితానికి ఆయనే శివుడు. అంతే! నేను ‘అఖండ’ ఆర్ఆర్ (నేపథ్య సంగీతం) చేస్తున్న సమయంలో స్క్రీన్ మీద నిజంగా శివుడిని చూస్తున్నాను. శివుడికి పూజ చేసేటప్పుడు ఎంత దీక్షగా ఉంటామో.. ఈ సినిమాకు ఆర్ ఆర్ చేసేటప్పుడు కూడా అలానే చేశాను. సాధారణంగా నేను నాన్ వెజ్ తినను. ఆమ్లెట్ మాత్రం తింటాను. అయితే, ‘అఖండ’ సినిమాకు ఆర్ఆర్ చేసేటప్పుడు ఆమ్లెట్ కూడా తినకుండా పని చేశాను. రోజూ లింగ పూజ చేస్తూ చాలా కష్టపడ్డాను’’ అని చెప్పుకొచ్చాడు తమన్.
అనంతరం దర్శకుడు గోపిచంద్ మలినేని గురించి మాట్లాడాడు తమన్. ‘క్రాక్’ సినిమా నుంచి గోపీచంద్ మలినేని 2.ఓ వెర్షన్ చూస్తున్నాని అన్నాడు తమన్. వీరసింహారెడ్డి సినిమాలో ఫైట్స్ చాలా బాగా డిజైన్ చేశాడని ప్రశంసించాడు. గోపీచంద్ తనకు ‘వీర సింహా రెడ్డి’ కథను చాలా తక్కువ సమయంలో చెప్పాడని, సినిమాలో ఎనిమిది ఫైట్స్ ఉండటంతో నేరేషన్ వెంటనే పూర్తయిందని తెలిపాడు.
వీర సింహారెడ్డి సినిమాలో.. యాక్షన్ సీక్వెన్సులకు ఆర్ఆర్ చేసేటప్పుడు స్టిక్కులతో కాదని.. చేతుల్లో రెండు కత్తులు పెట్టుకుని వాయించానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు తమన్. బాలకృష్ణ తమ గుండెల్లో ఉన్నారు కాబట్టి ఆయన సినిమాకు నిజాయతీగా పని చేస్తానని తెలిపాడు. చిరంజీవి, బాలకృష్ణ… 2022లో కూడా పోటీ పడుతున్నారని, వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. తమన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.