కాళ్లు, చేతులు, ఒంట్లో అన్నీ అవయవాలు సక్రమంగా ఉన్నా మనలో ఎంతో మందికి మన పని మనం చేసుకోవడానికే బద్దకం. కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి అనే కొటేషన్స్ చదువుతూ ఉంటాం. కలలు కంటాం.. కానీ, వాటిని నిజం చేసుకునేందుకు ఏ చిన్న ప్రయత్నం చేయం. అలాంటి వారంతా చిన్నబోయేలా ఈ అబ్బాయి సూపర్ సింగర్ జూనియర్స్ షోలో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. చూపు లేకపోయినా అనుకున్నది సాధించేందుకు నిత్యం శ్రమిస్తూనే ఉన్నాడు. అన్నీ ఉన్నా ఎంతో మంది లక్ష్య సాధనలో వెనుకడుగు వేస్తుంటే.. అంధుడైనా కూడా పట్టు విడవకుండా పోరాడుతున్నాడు.
తన గాత్రంతో న్యాయనిర్ణేతలనే కాదు.. యావత్ తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసేందుకు సిద్ధమయ్యాడు. సూపర్ సింగర్ జూనియర్స్ నుంచి విడుదలైన తాజా ప్రోమోలో ఈ అబ్బాయి అందరి దృష్టిని ఆకర్షించాడు. న్యాయనిర్ణేతలు తమ కుమారుడిని పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఆ తల్లి కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఆ తల్లిదండ్రులు తమ కుమారుడిని చూస్తూ చప్పట్లు కొడుతూ ఆనందంతో పరవశించిపోయారు.
ఆ అబ్బాయి ఈ స్థాయికి రావడానికి అతని తల్లిదండ్రులే కాదు.. తమ్ముడు కూడా ఎంతో తోడ్పాటు అందిస్తున్నాడు. నిత్యం నిద్ర లేచిన దగ్గర నుండి మళ్లీ పడుకునే వరకు ప్రతి పనిలో అన్నకు ఈ తమ్మడు తోడుగా ఉంటాడు. అన్న ఏ పాట పాడాలనుకున్నా.. ఏ పాట ప్రాక్టీస్ చేయాలను కున్నా ప్రగీ దగ్గరుండి హెల్ప్ చేస్తాడు. అంతే కాకుండా అన్నతో కలిసి ఆ తమ్ముడు పాట పంచుకోవడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఆ అన్నదమ్ముల మధ్యున్న ప్రేమానురాగాలను చూసి అక్కడున్న వారి కళ్లు చమర్చాయి.
లోపం ఉన్నా తల్లిదండ్రుల కల నెరవేర్చేందుకు ఈ కుమారుడు తన శ్రాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఆ అన్నను గెలిపించేందుకు తమ్ముడు పడుతున్న ఆరాటం ముచ్చట గొలుపుతోంది. కల్మషంలేని వారి ప్రేమ ఎంతో మందిని కట్టిపడేస్తోంది. అంతా బాగున్నా నాకేం చేశావ్ అని తల్లిదండ్రులను రోడ్డున పడేసే కొడుకులకు, ఆస్తి కోసం తోబుట్టువులను అంతమొందించిన దుర్మార్గులకు వీరి బంధం ఒక కనువిప్పు కావాలంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఈ జూనియర్ సింగర్ కు కామెంట్స్ రూపంలో మీరూ ఆల్ ది బెస్ట్ చెప్పేయండి.