'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ రావడానికి కారణం ఎవరు అంటే మీరు రాజమౌళి లేదా కీరవాణి.. ఇలా తలో పేరు చెబుతారు. కానీ కార్తికేయ అనే వ్యక్తి అసాధ్యం అనుకున్నది కాస్త సాధ్యమైంది అంటే నమ్ముతారా? ఇంతకీ ఆ కార్తికేయ ఎవరో తెలుసా?
RRRకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ డైరెక్టర్ రాజమౌళి, హీరోలు రామ్ చరణ్-ఎన్టీఆర్, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్-కాలభైరవ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ని తెగ పొగిడేస్తున్నారు. సామాన్యుల నుంచి స్టేట్ సీఎంల వరకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ పేర్లు ప్రస్తావిస్తూ మెచ్చుకుంటున్నారు, ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే ఆస్కార్ వీళ్ల వల్లే వచ్చిందా అంటే అవును, బట్ వీళ్లందరి వెనకాల ఓ మాస్టర్ మైండ్ ఉంది. అతడే SS కార్తికేయ. ఇంతకీ ఎవరీ కార్తికేయ? ఆస్కార్ రావడానికి ఇతడు ఎందుకు కారణం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. లాస్ ఏంజెల్స్ లో ఎంతో గ్రాండ్ గా ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో కీరవాణి, చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్నారు. అయితే స్టేజీపై కీరవాణి మాట్లాడుతూ రాజమౌళితో పాటు కార్తికేయకు మాత్రమే థ్యాంక్స్ చెప్పారు. దీంతో అసలు ఎవరీ కార్తికేయ అని తెగ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. రాజమౌళి సినిమాలు, ఫ్యామిలీ గురించి కాస్తోకూస్తో ఐడియా ఉన్నవాళ్లకు కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఆస్కార్ విషయంలో అతడు ఎలాంటి కీ రోల్ ప్లే చేశాడనేది మాత్రం ఎవరికీ దాదాపు తెలిసి ఉండదు.
రమా రాజమౌళికి మొదటి భర్త వల్ల కలిగిన సంతానం కార్తికేయ. ఆ తర్వాత రమని పెళ్లి చేసుకున్న రాజమౌళి.. కార్తికేయని సొంత కొడుకు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నాడు. కొన్నాళ్లు టెక్నీషియన్ గా పనిచేసిన కార్తికేయ.. ప్రస్తుతం లైన్ ప్రొడ్యూసర్ స్థాయికి వెళ్లిపోయాడు. ‘బాహుబలి’కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి కారణం కార్తికేయ అని అంటుంటారు. మార్కెటింగ్, ప్రమోషన్స్ విషయంలో దిట్ట అయిన ఇతడు.. ‘ఆర్ఆర్ఆర్’ స్టోరీ దగ్గర నుంచి ఆస్కార్ గెలుచుకోవడం వరకు ప్రతిదీ దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. మార్కెటింగ్, ఇతర దేశాల్లో సినిమా ప్రదర్శన, డబ్బు లెక్కలు, ఆస్కార్ వరకు వెళ్లడానికి ప్లానింగ్ అంతా ఆర్గనైజ్ చేసింది కార్తికేయనే. ఉత్తమ విదేశీ మూవీ విభాగంలో మన దేశం నుంచి ‘ఆర్ఆర్ఆర్’ని జ్యూరీ పంపలేదు. దాంతో ఆస్కార్ ఆశలు ఆవిరైపోయావని ఫ్యాన్స్ చాలామంది అనుకున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ కల ఆవిరైపోయిందనే టైంలోనే కార్తికేయ రంగంలోకి దిగాడు. వేరియన్స్ ఫిల్మ్స్ సహాయంతో ఆస్కార్ కు సినిమాని పంపడానికి కావాల్సిన అన్ని అర్హతలను సాధించాడు. అక్కడ నుంచి అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో స్క్రీనింగ్, ప్రమోషన్స్ విషయంలో దగ్గరుండి ప్రతి బాధ్యతను పక్కగా నిర్వర్తించాడు. అలా ఆస్కార్ విషయంలో టీమ్ అంతా ముందు కనిపిస్తుంటే.. తాను మాత్రం తెర వెనక ఉంటూ కర్త-కర్మ-క్రియ అయి నడిపించాడు. చివరకు అసాధ్యం అనుకున్న ‘ఆస్కార్’.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ చేతుల్లో పడేలా చేశాడు. అందుకే కీరవాణి.. కార్తికేయ పేరుని ప్రత్యేకంగా ప్రస్తావించారు. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఆస్కార్ గెలుచుకున్న తర్వాత కార్తికేయని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టారు. ఇలా ఆస్కార్ రావడానికి రాజమౌళి కారణమని అనుకుంటారు కానీ దాని వెనక కార్తికేయ కష్టం చాలా ఉంది. తన గురించి జనాలు తెలియనివ్వకుండా తెర వెనకే ఉండిపోయిన కార్తికేయ.. రాబోయే రోజుల్లో మహేష్ సినిమాతో మరో ఆస్కార్ అవార్డ్ వచ్చేలా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి ఆస్కార్ రావడానికి కార్తికేయ కారణమంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.