తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డు రావడం తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఏంటో చాటి చెప్పింది.
తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెం.1 చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీ ఘనత ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆస్కార్ ప్యానెల్ నుంచి టాలీవుడ్‌కు మరో శుభవార్త అందింది. వివరాల్లోకి వెళితే..
ప్రపంచ వ్యాప్తంగా చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుక ఈ సంవత్సరం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఎంతో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ అవార్డు వేడుకలో 23 విభాగాల్లోని విజేతలను ప్రకటించి వారికి ఆస్కార్ అవార్డులు అందజేశారు. ఇక ఈ ఏడాది 95వ ఆస్కార్ వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘ఆర్ఆర్ఆర్’సినిమా నామినేటె అయిన విషయం తెలిసిందే. ఇందులో ‘నాటు నాటు’ సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ సాంగ్ కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణి, లిరిక్స్ అందించిన చంద్రబోస్ ఆస్కార్ స్టేజ్ పై అవార్డు అందుకోవడంతో తెలుగు వారందరూ సంబరాలు జరుపుకున్నారు. ఆస్కార్ గెలవడమే కాదు.. ఏకంగా జ్యూరీ మెంబర్స్ అయ్యే అవకాశం కూడా టాలీవుడ్ కి దక్కడం మరో విశేషం.
ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ స్థాయిలో ఎంత గొప్ప పేరు తెచ్చిందో.. కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో సాధించింది. తాజాగా ఆస్కార్ ప్యానెల్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి మరో గుడ్ న్యూస్ అందింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, కరణ్ జోహార్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, మణిరత్నం, సెంథిల్ కుమార్, సాబు సిరల్, చైతన్య తమహానే, షౌనక్ సేన్, సిద్దార్థ్ రాయ్ కపూర్ ఆస్కార్ ప్యానెల్ లో చోటు దక్కింది. ఇక రాబోయే ఆస్కార్ అవార్డు ఫంక్షన్ లో సెలక్ట్ కాబడిన వీరందరికీ ఓటే వేసే హక్కు ఉంటుంది. వచ్చే సంవత్సరం ఆస్కార్ వేడుకలకు మార్చి 10 న జరగనున్నాయి. ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి కూడా ఓటు వేయనున్నారు.
ఇదిలా ఉంటే 2023లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో చేయడానికి సుమారు 398 మంది వ్యక్తుల జాబితాలో ఈసారి భారతీయ కళాకారులు దాదాపు పన్నెండు మంది వరకు ఉండబోతున్నారు. వీరిలో ఆర్ఆర్ఆర్ మూవీ కాంబో రామ్ చరణ్, ఎన్టీఆర్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్ లు ఉన్నారు. ఆస్కార్ బరిలో నిలిచే చిత్రాలకు టాలీవుడ్ నుంచి ఈ నలుగురు కి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. వీరి సభ్యత్యం లైఫ్ టైమ్ వరకు ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ జాబితాలో ప్రముఖ దర్శకుడు రాజమౌళికి చోటు దక్కలేదు. ప్రస్తుతం అకాడమీలో పదివేల మందికి పైగా సభ్యులు ఉన్నారు.