బాల నటిగా ప్రయాణం మొదలు పెట్టి, అగ్ర హీరోలందరి సరసన నటించి, అతిలోక సుందరిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీదేవి. అందం, అమాయకత్వం కలగలపిన నటి ఆమె. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా శ్రీదేవి సొంతం. బాలీవుడ్ టూ మాలీవుడ్ వరకూ ఓ శకం పాటు సినీ పరిశ్రమను ఏలిన రారాణి. అగ్ర హీరోలందరి సరసన జతకట్టి మూడు దశాబ్దాల పాటు తిరుగులేని హీరోయిన్‌గా నిలిచారు. పెళ్లి తర్వాత 15 సంవత్సరాల పాటు సినిమాలకు దూరమై.. తిరిగి వెండితెరపై మెరిశారు. అనుకోకుండా 2018లో కన్నుమూశారు. భారతీయ చిత్ర పరిశ్రమను ఏలిన ఆ తార జీవిత కథను ఇప్పుడు పుస్తక రూపంలో తీసుకురానున్నారు.
‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’పేరుతో ఆమె జీవిత కథను అక్షర రూపంలో తీసుకురాబోతున్నారు ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీదేవి జీవిత చరిత్రను రాసేందుకు అనుమతించిన ఆమె భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్ లకు ధ్యనవాదాలు తెలిపారు. ఇదే తన తొలి బయోగ్రఫీ అని వెల్లడించారు. ఈ పుస్తకంపై బోనీ కపూర్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీదేవి అంటే ఓ అద్భుతమని, ఆమె నటనెంతో తనకు ఇష్టమన్నారు. తెరపై ఆమె కనిపించినప్పుడు అభిమానుల నుండి వచ్చే స్పందన చూసి చాలా సంతోషించేదన్నారు. తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచేదన్నారు.
ధీరజ్ ఆమె జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడం తమకు ఆనందంగా ఉందన్నారు. శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ లో కన్నుమూశారు. ప్రమాదవశాత్తు బాత్ డబ్‌లో మునిగి చనిపోయారు. బోనీ కపూర్ ను వివాహం చేసుకున్నాక.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన 2012లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె రీ ఎంట్రీ ఇచ్చాక తెరకెక్కిన చిత్రం ఇంగ్లీష్ వింగ్లీష్. ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాను ఐదో వర్థంతి సందర్భంగా ఈ నెల 24న చైనాలో విడుదల చేయనున్నారు. అక్కడ 6000 వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తెలుగు తెరపై ఆమె నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.