2022.. ఈ ఏడాదిని దక్షిణాది సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు ఓవర్సీస్ మార్కెట్ ని షేక్ చేసిన సౌత్ సినిమాలు షేక్ చేసిన సంవత్సరమిది. మరి సౌత్ సినిమాలే ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంటే.. నార్త్(బాలీవుడ్) సినిమాలు ఎందుకు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి. బాహుబలి మూవీతో పాన్ ఇండియా పరిధులన్నీ చెరిపేసి.. సౌత్ సినిమాల విజయాల పరంపర మొదలైంది. ముఖ్యంగా 2022 ఏడాదిని దక్షిణాది పాన్ ఇండియా సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా సంపూర్ణంగా వినియోగించుకున్నాయి. దీంతో బాలీవుడ్ లో సినిమాలు ఎందుకు ఆడట్లేదు? అసలు ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి? అనే చర్చలు మొదలయ్యాయి.
దక్షిణాది సినిమాలలో విశేషం ఏంటి? కథల ఎంపికనా లేక ఎంచుకున్న నేపథ్యమా? బాలీవుడ్ లో మిస్ ఏం అవుతోంది? హై బడ్జెట్ తో సినిమాలు.. భారీ తారాగణం.. అద్భుతమైన విజువల్స్.. గ్రాండియర్ సాంగ్స్.. మరి లోపం ఎక్కడుంది? అనే అంశాలపై రీసెంట్ గా బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ అనుపమ చోప్రా ఓ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సౌత్ నుండి విశ్వనటుడు కమల్ హాసన్(విక్రమ్).. దర్శకుడు రాజమౌళి(ఆర్ఆర్ఆర్).. గౌతమ్ మీనన్(ది లైఫ్ ఆఫ్ ముత్తు).. లోకేష్ కనకరాజ్(విక్రమ్).. పృథ్వీరాజ్ సుకుమారన్(జనగణమన).. ప్రొడ్యూసర్ ప్రియాంక దత్(సీతారామం) పాల్గొన్నారు.
ఈ మీట్ లో పాల్గొన్నవారంతా సౌత్ నుండి ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ అందుకున్నవారు. ఇంకా చాలామంది ఉన్నప్పటికీ, ప్రెజెంట్ వీరు ఆరుగురు సౌత్ ని ఆ మీట్ లో రిప్రెసెంట్ చేశారు. అయితే.. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఫెయిల్ అవ్వడానికి కారణాలేంటి? సౌత్ సినిమాలు ఎలా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో వర్కౌట్ అవుతున్నాయి? మరి సౌత్ లో సినిమాల వెనుక బ్యాక్ గ్రౌండ్ ఎలా జరుగుతోంది? సినిమాలను ప్రేక్షకులకు కనెక్ట్ చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అనే విషయంలో చర్చలు జరిగాయి. క్రిటిక్ అనుపమ బాలీవుడ్ ని ఎక్కువగా ప్రస్తావించకుండా.. సౌత్ విజయాలకు కారణం? గ్రౌండ్ వర్క్ ఏంటి? అనే విధంగా చర్చలు జరిపారు.
ఈ క్రమంలో ఒక పాపులర్ సినిమాని.. ఎక్కడా కంప్రమైజ్ అవ్వకుండా సౌత్ లో ఎలా క్రియేట్ చేస్తున్నారు? అనే ప్రశ్నకు.. కమల్ హాసన్ స్పందిస్తూ.. ‘హాలీవుడ్ సినిమాలు చూడటం తగ్గించి, ఇండియన్ సినిమాలు చూడండి. హాలీవుడ్ నుండి కాకుండా ఇండియన్ సినిమాల నుండి ఇన్స్పైర్ అవ్వండి.’ అని చెప్పారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. ‘సౌత్ లో రెమ్యూనరేషన్స్ పై పెద్దగా ఆకలి ఎవరికీ లేదు. అది ఇక్కడ బాలీవుడ్ లో ఉంది. అనౌన్స్ మెంట్ బాగా జరిగిందని సినిమా బిజినెస్ బాగా చేస్తుందని అనుకోవద్దు. అసలు సినిమా అప్పుడే మొదలవుతుంది. ఎప్పుడైనా సరే.. ఆడియెన్స్ తో కనెక్షన్ అనేది సినిమాలో మిస్ అవ్వకూడదు.’ అని చెప్పారు. ఆ తర్వాత కమల్ హాసన్.. ‘కాంస్టాంట్ హిట్స్ హిందీలో కొత్త కాదు.. ఆల్రెడీ తెలుగులో రాజమౌళి తీశారు. బిగ్ హీరోలను ఒక్కటిగా చేర్చి సినిమాలు తీయాలని ఇప్పుడు మేం ట్రై చేస్తున్నాం అన్నారు.
మరి సినిమాల పరంగా రిస్క్ ఏదంటే మీరు ఏం చెబుతారు? అనే ప్రశ్నకి లోకేష్ కనకరాజ్ స్పందిస్తూ.. ఒక డైరెక్టర్ గా కథ మనల్ని ఎక్సయిట్ చేస్తే చాలు.. ఆ కథను సినిమాగా తీసేందుకు అడుగు ముందుకేస్తాం. ఇక రిస్క్ అంటే.. ఒక కథను, ఐడియాను ఎంచుకున్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా లేదా? జనాలకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. నేనైతే నా టీమ్ అందరితో డిస్కస్ చేసి.. అందరూ ఎక్సయిట్ అయితే ఆ సినిమాని సెట్స్ పైకి తీసుకెళతాం’ అన్నారు. ఇదే విషయం పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ‘జనాలకు మనం ఏం చెబుతున్నాం అనేది చాలా ముఖ్యం. తెరపై కనిపించే క్యారెక్టర్స్ ఏం మాట్లాడుకుంటున్నాయి? అనేది నేరుగా ఆడియెన్స్ ఫీల్ అయ్యేలా చూసుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదు’ అన్నారు.
ఇక సినిమాలో లార్జర్ దెన్ లైఫ్ అనే పాయింట్ ని ఎలా పరిగణిస్తారు? అనే ప్రశ్నకి.. స్టోరీ.. క్యారెక్టర్స్ అనేవి కుదిరినప్పుడు.. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా కంటెంట్ జనాల్లోకి వెళ్తుంది. ఉదాహరణకి బాహుబలిలో ప్రభాస్, ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను చూసుకుంటే.. ఆ క్యారెక్టర్స్ లార్జర్ దెన్ లైఫ్ ఉంటాయి.. కానీ, ఎక్కడో వీళ్ళు మనవాళ్లే.. మనలో నుండి వచ్చినవాళ్లే అనే పాయింట్ జనాలని కట్టిపడేస్తుంది. అదే సౌత్ లో జరుగుతోంది’ అని చెప్పారు పృథ్వీరాజ్. మరి సినిమాలలో యాక్షన్ సీక్వెన్స్ లను ఎలా డిజైన్ చేస్తారు? అనే ప్రశ్నపై లోకేష్ కనకరాజ్ స్పందిస్తూ.. ‘యాక్షన్/వయోలెన్స్ అనేవి జస్ట్ సినిమాలో పార్ట్స్ అంతే. కానీ.. ఆ యాక్షన్ కి, వయోలెన్స్ కి కారణం ఏంటనేది చాలా ముఖ్యం. అక్కడొక ఫైట్ జరగబోతుంది అనంటే.. దానికి ముందు బలమైన కారణం ఉండాలనేది మేము చూసుకుంటాం’ అన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ.. ‘సినిమాలో యాక్షన్/వయిలెన్స్ అనేది జనాలు ఫీల్ అయ్యేలా చేయాలి. ఆ వయిలెన్స్ తో అసలు మనం జనాలకు ఏం చెబుతున్నాం అనేది ముఖ్యం’ అన్నారు. ఇదే విషయంపై గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. యాక్షన్ సీక్వెన్స్/వయిలెన్స్ అనేవి సినిమా జానర్ పై కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. ఆడియెన్స్ తో కనెక్షన్ పరంగా తెలుగు సినిమాలే ఎక్కువ పాపులర్ అయ్యాయి. కానీ.. ఇప్పుడు రైటింగ్ పరంగా మలయాళం టాప్ లో ఉంది. కట్ చేస్తే.. ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీలో డౌన్ లో నుండి టాప్ లోకి వచ్చింది. ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీకి ఒక రకమైన స్టోరీ టెల్లింగ్ విధానం ఉందని చెప్పారు.
అంతేగాక “కలెక్షన్స్ పరంగా అద్భుతాలు సృష్టించాలంటే.. పెద్ద బడ్జెట్ అవసరం లేదని రీసెంట్ గా కాంతార ప్రూవ్ చేసింది. ఆ సినిమా కలెక్షన్స్ విని మా మైండ్ పోయింది. మీరెప్పుడైనా సరే మార్కెట్ గురించి కాదు.. ఆడియెన్స్ గురించి ఆలోచించాలి. సినిమా అనేది ఎప్పుడూ ఆడియెన్స్ తో కనెక్ట్ అయ్యుండాలి” అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. అయితే ఈ మీట్ లో కన్నడ నుండి ఎవరు రాలేదు. కానీ, కాంతార హీరో రిషబ్ శెట్టి.. సౌత్ సినిమాలకి, బాలీవుడ్ సినిమాలకి మధ్య డిఫరెన్స్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ వారు హాలీవుడ్ ని.. ఆ పార్టీస్, మోడరన్ కల్చర్ ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు.. కానీ, మేం సౌత్ లో ఒరిజినల్ స్టోరీస్, క్యారెక్టర్స్ ని ఫాలో అవుతాం. ప్రాంతీయ కల్చర్ ని ఎక్కువగా ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తాం. అందుకే పుష్ప, బాహుబలి, కేజీఎఫ్ లాంటివన్నీ జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి’ అని బాలీవుడ్ పై కౌంటర్ వేశారు.
ప్రస్తుతం బాలీవుడ్ ఫెయిల్యూర్స్ పై కాకుండా ఇండైరెక్ట్ గా సౌత్ సినిమాల విజయాలపై చర్చించడంతో.. సౌత్ లో సినిమాలను ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఎలా యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేస్తున్నారు? ఎలా ఒక పాపులర్ సినిమాని సిద్ధం చేస్తున్నారు? అనే ఎన్నో విషయాలు చర్చల దశకు వచ్చాయి. మరి రాజమౌళి చెప్పినట్లు మార్కెట్ ని కాదు.. ఆడియెన్స్ ని ఫాలో అవ్వండి.. అనేది ఇకపై బాలీవుడ్ ఫాలో అవుతుందా లేదా చూడాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ సౌత్ సినిమాల సక్సెస్, బాలీవుడ్ ఫెయిల్యూర్ గురించి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.