నటి చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో తమిళ చిత్ర సీమలో ఓ కలకలం చెలరేగింది. ఇక, అప్పటినుంచి ఆమె వైరముత్తును టార్గెట్ చేస్తూ పోస్టింగ్‌లు, వీడియోలు పెడుతూనే ఉన్నారు. వైరముత్తుకు మద్దతు తెలిపే వారు చిన్మయిని టార్గెట్ చేసి చాలా ఇబ్బంది కూడా పెట్టారు. అయినా ఆమె తన పోరాటం ఆపలేదు. వీలు చిక్కినప్పుడల్లా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తూనే ఉన్నారు.
తాజాగా, చిన్మయి నటి వీజే అర్చనకు వార్నింగ్ ఇచ్చారు. దీనికి కారణం అర్చన వైరముత్తును కలవటమే. రెండు రోజుల క్రితం వీజే అర్చన ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ దగ్గరకు వైరముత్తు వచ్చారు. ఈ నేపథ్యంలో అర్చన వైరముత్తుతో మాట్లాడారు. ఆయనతో ఫొటోలు కూడా తీసుకున్నారు. వైరముత్తు, అర్చన తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. ఈ ఫొటోలను అర్చన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ చూడండి! నేను షూటింగ్‌లో ఉండగా ఎవరిని కలిశానో’’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఫొటోలపై చిన్మయి స్పందించారు. ‘‘ అది ఇలాగే మొదలవుతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. అతడితో తగినంత దూరాన్ని పాటించు. నీతో ఎవ్వరూ లేనప్పుడు అతడిని కలవవద్దు’’ అని హెచ్చరించారు. కాగా, సింగర్ చిన్మయి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాటలు పాడారు. సింగర్ గానే కాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, రేడియో జాకీగా, వ్యాపారవేత్తగా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. తెలుగులో ఎక్కువగా సమంతకు తన గొంతును అరువిచ్చారు. సమంతతో చిన్మయికి మంచి అనుబంధం ఉంది.