ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘బాయ్స్’ చిత్రంతో హీరోగా పరిచయమైన సిద్ధార్థ్ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..!’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఓ మై ఫ్రెండ్’ ఇలా పలు ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రం ‘మహాసముద్రం’. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకర్షించలేకపోయింది. ప్రస్తుతం ఎస్కేప్ లైవ్ అనే హిందీవెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సీరీస్ డిస్నీ+హాట్ స్టార్‌లో లో మే 20 నుంచి ప్రీమియర్ కానుంది.
ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దార్థ తన కెరీర్ గురించి మాట్లాడారు. తాను దక్షిణాది చిత్రాల్లో ఎక్కువగా నటించానని.. అందుకే తాను అక్కడ హీరోగా భావిస్తారని అన్నారు. వాస్తవానికి తాను ఢిల్లీకి చెందినవాడినని.. హిందీ మాట్లాడటం తనకు కొట్టిన పిండి అన్నారు. గతంలో తాను హిందీ మూవీలో నటించిన విషయం తెలిసిందే అన్నారు. ప్రస్తుతం తాను ఎస్కేప్ లైవ్ వెబ్ సీరీస్ లో నటిస్తున్నానని.. కథ నాకు బాగా నచ్చడంతో కమిట్ అయినట్లు చెప్పారు.
ఇండస్ట్రీలో తనకు నచ్చినట్టుగానే ఉంటాను.. ఎవరి మనోభావాలను నొప్పించకుండా ఉంటానని అన్నారు. తనకు నచ్చిన పాత్రలు వచ్చినంత వరకు సినిమాల్లో నటిస్తానని, అలాంటి అవకాశాలు రానప్పుడు నటనకు గుడ్ బై చెప్పేస్తానని అన్నారు. తాను బాగానే చదువుకున్నానని.. వేరే ఉద్యోగం వెతుక్కుంటా అని సిద్దార్థ్ పేర్కొన్నారు. హీరో సిద్ధార్థ్ తన కెరీర్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.