సీనియర్ హీరో కార్తీక్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. పేరుకు తమిళ హీరో అయినా.. సరే తెలుగులో కూడా సీతాకోక చిలుక వంటి క్లాసిక్ సినిమాతో సంచలనం సృష్టించాడు. ఆ తరువాత అన్వేషణ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కూడా తెలుగులో వరుస చిత్రాలు చేశాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రల్లో రాణిస్తున్నాడు. ఇక కార్తీక్ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాడు. సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ అక్కడ అనుకున్న మేర సక్సెస్ కాలేదు. ఒకానొక దశలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు. తనకున్న చెడు అలవాట్లే వల్లే.. తన జీవితం నాశనం అయ్యిందని.. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ముందు ప్రకటించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కార్తీక్ జీవితంలోని విశేషాలు..
కార్తీక్ అసలు పేరు.. మురళీ కార్తికేయ ముత్తురామన్. సినిమాల్లోకి వచ్చాక కార్తీక్‌గా మార్చుకున్నాడు. ప్రముఖ నటుడు ఆర్ ముత్తు రామన్ కుమారుడు కార్తీక్. తొలిసారి భారతీరాజా చిత్రం ఓవాతిల్లై(1981) ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత వరుస సినిమాలు చేశాడు. ఇక తెలుగులో సీతాకోక చిలుక, అన్వేషణ, మగరాయుడు వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్ని రకాల భావోద్వేగాలు పండిచడంలో కార్తీక్ దిట్ట. దాంతో నరస నాయకన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అన్ని భాషల్లో కలిపి 125 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించాడు. తమిళ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి పలు అవార్డులతో పాటు నంది అవార్డు కూడా అందుకున్నాడు.
వ్యక్తిగత జీవితం..
కార్తీక్ 1988లో సహనటి అయిన రాగిణిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ సోలైకుయిల్ చిత్రంలో కలిసి నటించారు. వీరికి గౌతమ్ కార్తీక్, ఘైన్ కార్తీక్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గౌతమ్ కార్తీక్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 1992లో రాగిణి సోదరి రథిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి తిరన్ కార్తీక్ అనే కుమారుడు ఉన్నాడు.
2000 సంవత్సరానికి ముందు వరకు కార్తీక్ కెరీర్ ఉజ్వలంగా సాగింది. ఆ తర్వాత నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.ఆ తర్వాత 2005లో వచ్చిన ప్రముఖ నటుడు సత్యరాజ్ శివలింగం ఐపీఎస్ సినిమాలో తొలిసారి విలన్ పాత్రలో నటించాడు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తనకున్న చెడు అలవాట్ల వల్లే తన కెరీర్ నాశనం అయిందని కార్తీక్ ఒక సందర్భంలో స్వయంగా వెల్లడించాడు.
రాజకీయ జీవితం..
2006 తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందు కార్తీక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి.. తమిళనాడు రాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా నియమితుడయ్యాడు. పార్టీ తరఫున ప్రచారం చేశాడు. కానీ ఆ ఎన్నికల్లో పార్టీ దారుణంగా విఫలమయ్యింది.
ఇక 2009 లోక్‌సభ ఎన్నికలకు ముందు కార్తీక్ స్వంతంగా అహిళ ఇండియా నాదలుమ్ మక్కల్ కట్చిని స్థాపించాడు. ఈ ఎన్నికల్లో విరుదునగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు కేవలం 15 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తరువాత రాజకీయాల నుంచి తప్పుకుని.. సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.