జీవితంలో సక్సెస్ అయ్యేవారు రెండు రకాలు. ముందు కష్టపడి అన్నీ సంపాదించుకొని లైఫ్ ని చాలా హ్యాపీగా గడిపేవారు ఓ రకం. ముందు సుఖపడి తర్వాత కష్టాలు పడేవారు రెండో రకం. కానీ.. ఈ రెండూ కాకుండా జీవితంలో పడాల్సిన కష్టం పడి.. వయసు పైబడ్డాక చేతిలో చిల్లిగవ్వ లేకుండా గడ్డుకాలాన్ని అనుభవించేవారు ఎక్కడో కొందరు తారసపడుతుంటారు. అలా ఇండియన్ సినిమా చరిత్రలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ఎందరో స్టార్ హీరోహీరోయిన్లతో, మరెందరో లెజెండ్స్ తో పనిచేసి.. వృద్ధాప్యం వచ్చాక ఆర్థికంగా చితికిపోతున్న వారిని చూస్తే ఒక్కసారిగా గుండె తరుక్కుపోతుంది. అలాంటి గడ్డు పరిస్థితిని అనుభవిస్తున్నారు సీనియర్ సినిమాటోగ్రాఫర్ పి. దేవరాజ్.
ఈ తరం నటీనటులకు, ప్రేక్షకులకు ఈయన ఎవరనేది పెద్దగా తెలియకపోయినా.. 80, 90లలో కెమెరామెన్ దేవరాజ్ అంటే సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఎందరో గొప్ప నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజిఆర్, రాజ్ కుమార్, రజినీకాంత్, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, మురళీమోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా ఎందరో హీరోలతో దేవరాజ్ వర్క్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ భాషలలో కూడా సినిమాటోగ్రాఫర్ గా దాదాపు 300 లకు పైగా సినిమాలు చేశారు దేవరాజ్. అప్పట్లో ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదంటే అతిశయోక్తి కాదు.
కెమెరామెన్ గా ఫామ్ లో ఉన్నప్పుడు ఎన్నో విజయాలు, లగ్జరీ లైఫ్, సొంత ఇల్లు, ప్రాపర్టీస్ తో హుందాగా బ్రతికిన దేవరాజ్.. ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ.. రోజుకు ఒక పూట తిండి తినడానికి కూడా అవస్థ పడుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఓ కార్ యాక్సిడెంట్ లో కాలు విరిగి.. అప్పటినుండి పూర్తిగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన తండ్రి నుండి తమ్ముళ్ల వరకూ ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్స్ గా గొప్ప పేరు సంపాదించుకున్నారు. కానీ.. తల్లిదండ్రులు చనిపోయాక ఏ ఒక్కరూ తన ఆర్థిక పరిస్థితిని చూసి ఆదుకోవడానికి, కనీసం పలకరించడానికి రాలేదని వాపోయారు. ఎంతో గొప్పగా బ్రతికిన తాను కష్టం మీద తన కొడుకును చదివించానని.. తన కొడుకు సెటిల్ అయ్యాక తాను ఏమైపోయినా పరవాలేదని కంటతడి పెట్టుకున్నారు దేవరాజ్.
తెలుగులో ఎన్టీఆర్ తో నేరం నాదికాదు ఆకలిది, లాయర్ విశ్వనాధ్.. చిరంజీవితో టింగురంగడు, పులి బెబ్బులి.. శోభన్ బాబుతో ఖైదీ కాళిదాస్.. బాలకృష్ణతో భలే తమ్ముడు.. కృష్ణ, మోహన్ బాబులతో సింహగర్జన.. అలా మిగతా అన్ని భాషలలో కలిపి 300కు పైగా సినిమాలు చేసినట్లు చెప్పారు. అలాంటి లైఫ్ చూసి.. ఇప్పుడిలా ఎందుకు జీవచ్ఛవంలా ఉన్నానని, దేవుడు తనకే ఎందుకిలా పరీక్ష పెడుతున్నాడని చెబుతూ వాపోయారు. తనకు ఇప్పటికీ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతినెలా రూ. 5 వేలు, మురళీమోహన్ రూ. 3 వేల రూపాయలు పంపుతుంటారని తెలిపారు. అయితే.. ఇండస్ట్రీలో కొత్తవాళ్లు వస్తున్నకొద్దీ సీనియర్స్ మర్చిపోతున్నారని, సీనియర్స్ ని మర్చిపోకూడదని కోరారు దేవరాజ్.
ఇక ప్రస్తుతం తన పరిస్థితి గురించి చెబుతూ.. రూ. 8 వేలకు అద్దె ఇంట్లో కొడుకుతో ఉంటున్నానని, కొడుకుకి సరైన జాబ్ లేక ఒక్కోసారి పూట గడవడం కూడా కష్టంగా ఉందని, కొన్నిసార్లు చనిపోవాలని అనిపిస్తుందని ఏడ్చేశారు దేవరాజ్. ఇప్పటికైనా ఇండస్ట్రీలో సీనియర్స్ కి సినీ ప్రముఖులు హెల్ప్ చేయాలని, తనకు కూడా వీలైతే హెల్ప్ చేయగలరని రీసెంట్ గా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో రిక్వెస్ట్ చేశారు దేవరాజ్. ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ దేవరాజ్ కి సంబంధించి ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవరాజ్ పరిస్థితి చూస్తున్న ఎంతోమంది ప్రేక్షకులు, నెటిజన్స్ నెట్టింట రియాక్ట్ అవుతున్నారు. మరి ఇండస్ట్రీలో సీనియర్స్ కి ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.