ప్రపంచాన్ని తెగ భయపెట్టిన కరోనా థర్డ్ వేవ్ కరుణించి పక్కకు తప్పుకుంది…. ఆంధ్రాలో టికెట్ రేట్ల వివాదం సద్దుమణిగి భారీ బడ్జెట్ చిత్రాలకు మార్గాన్ని సుగమం చేసింది.. ఇలా ప్రతికూల పరిస్థితులు అనుకూల పవనాలుగా మారిన నేపథ్యంలో విడుదలయ్యే సినిమాలు ఏమాత్రం బాగున్నా బ్రహ్మరథం పడతాం.. ఏ మాత్రం తేడా వచ్చినా భరతం పట్టేస్తాం.. అన్నట్టుగా మంచి అవైటింగ్ మూడ్ లో ఉన్నాడు ప్రేక్షకుడు. అందుకే ఒక్కొక్కటిగా క్యూ కడుతున్నాయి భారీ అంచనాల భారీ చిత్రాలు.. బహు భాషల పాన్ ఇండియన్ చిత్రాలు. ఆ కోవలో ఈ రోజు విడుదలైంది రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్- పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యాం.
ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాణ సంస్థలు గోపి కృష్ణ మూవీస్- యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన బహు భాషా చిత్రం రాధేశ్యాం ఎలా ఉంది.? పాజిటివ్ టాక్ వచ్చిందా..? రేటింగ్ ఎంత..? రెవెన్యూ ఎలా ఉంది..? అనే ప్రశ్నలతో ప్రేక్షకాభిమానుల మస్తిష్కాలు హీటెక్కుతున్నాయి కదూ.. అందుకే ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా రాధేశ్యాం రివ్యూలోకి ఎంటర్ అవుదాం.
బాహుబలి, బాహుబలి 2, సాహో వంటి హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాల హ్యాంగోవర్ నుండి ఆ హేవీనేస్ నుండి బయటపడాలంటే అర్జెంటుగా ఒక ప్లజెంట్ అండ్ పీస్ ఫుల్ లవ్ స్టోరీ చేయాలి అన్న ప్రభాస్ రిక్వైర్మెంట్ కు సెల్యులాయిడ్ రూపమే రాధేశ్యాం.
ఇక రాధే శ్యామ్ కథలోకి వెళితే ప్రపంచ ప్రఖ్యాత పామిస్ట్ అంటే హస్త సాముద్రిక నిపుణుడు అయిన విక్రమాదిత్య(ప్రభాస్) అపాయింట్మెంట్ కోసం దేశాధ్యక్షులు, ప్రధానులు, బిజినెస్ మాగ్నెట్స్ సైతం పడిగాపులు పడుతుంటారు అని ఆయన గురువైన పరమహంస (కృష్ణంరాజు) పాత్ర ద్వారా తొలి సీన్ లోనే ఇంట్రడక్షన్ ఇప్పించడంతో హీరో రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే అంతర్జాతీయ స్థాయి కలిగిన విక్రమాదిత్య ఇండియా వదిలేసి దేశదేశాలు తిరుగుతుంటాడు. అలా తను వెళ్లిన ఇటలీలో 1976 నాటి ఫ్లాష్ బ్యాక్ తో అతని పాత్రను పరిచయం చేస్తాడు పరమహంస.
తన జీవితంలో ప్రేమకు తావు లేదు అని తన జాతకాన్ని తానే నిర్ధారించుకున్న విక్రమాదిత్య ఒక ఫైన్ మూమెంట్లో ప్రేరణ (పూజా హెగ్డే)ను చూసి ప్రేరణ పొందుతాడు. అయితే ప్రేరణ పట్ల తన ప్రేమకు ప్రేమ అని కాకుండా ఫ్లిర్టేషన్ షిప్ అనే ఒక కొత్తరకం నిర్వచనాన్ని చెప్తాడు. అంటే పరస్పర అంగీకారంతో ఇష్టం వచ్చినన్ని రోజులు ఇష్టం వచ్చినట్లుగా గడపటం ఆ తరువాత అదే పరస్పర అంగీకారంతో విడిపోవడం… అంటే ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న డేటింగ్ అనే కల్చర్ను 1976 రోజుల్లోనే ప్రతిపాదించాడు అని అర్థమవుతుంది. అయితే వృత్తి రీత్యా డాక్టర్ అయిన ప్రేరణ కూడా హస్తసాముద్రికంలో విక్రమాదిత్యకు ఉన్న పేరుప్రఖ్యాతులను, అతని స్టైలిష్ లివింగ్ స్టైల్ ను చూసి ఇష్టపడుతుంది. అయితే ప్రేరణ జీవితంలో ఒక అనూహ్యమైన విషాదం ఉంటుంది. జాతక రీత్యా విక్రమాదిత్య జీవితంలో ప్రేమకు తావే లేదు. ఇలా హీరో విషయంలో జాతక ప్రభావం… హీరోయిన్ విషయంలో అనూహ్యమైన విషాదం… ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షనే రాధే శ్యామ్ కథ. అందుకే తన కథకు ” the story of Destiny and Love అనే కాప్షన్ పెట్టుకున్నాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.
ఇది రాధేశ్యామ్ కథాకమామిషు… ఇక ఈ కథను దర్శకుడు రాధాకృష్ణ డీల్ చేసిన విధానాన్ని విశ్లేషించుకుంటే… చాలా సన్నివేశాలను ‘వాట్ ఏ టేకింగ్… వాట్ ఏ విజువల్.. అనుకునేంత అద్భుతంగా డీల్ చేశాడు. ముఖ్యంగా హీరో హీరోయిన్ కెమిస్ట్రీని కన్విన్సింగ్ గా, పొయటిక్ గా చెప్పటంలో చాలా సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ అప్రోచ్ ని కనబరిచాడు రాధాకృష్ణ. హస్త సాముద్రికం అనే ఒక సరికొత్త నేపథ్యంలో హీరో పాత్రను పరిచయం చేస్తూ… ద ఫైట్ బిట్వీన్ డెస్టినీ అండ్ సైన్స్ అనే అంశాన్ని సాధ్యమైన మేరకు కన్విన్సింగ్ గా చెప్పాడు.” జ్యోతిష్యం – 99 శాతం నిజం” అనే పుస్తకాన్ని రచించిన తన గురువుతో విభేదించి అది నూరు శాతం నిజం అని వాదించిన విక్రమాదిత్య జాతకం చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది అనే ప్రధాన ఇతివృత్తాన్ని ఆమోదయోగ్యంగా చెప్పాడు రాధాకృష్ణ.
ఇలా అద్భుతమైన సీన్స్ తో, విజువల్స్ తో ఆకట్టుకున్న రాధాకృష్ణ కొన్ని సన్నివేశాలలో బోర్ కొట్టించాడు అని చెప్పక తప్పదు. అసలు హస్తసాముద్రికం అనే ఒక ఇండియనైజ్డ్ కాన్సెప్ట్ కు ఆ ఇంగ్లీషు నేపథ్యం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తనకే తెలియాలి. బహుశా భారీ బడ్జెట్ట్ ,పాన్ ఇండియా రేంజ్ కావాలంటే అంత రిచ్ నేపథ్యం కావాలి అనుకున్నాడేమో.. కానీ దానివల్ల నేటివిటి మిస్ అవ్వటాన్ని ఎలా సమర్థించుకుంటారు.
ఇక విక్రమాదిత్య- ప్రేరణ పాత్రల మీద పెట్టిన శ్రద్ధ మిగిలిన పాత్రల మీద పెట్టకపోవడం ఏ క్యారెక్టర్ ను జస్టిఫై చేయలేకపోవడం ఈ సినిమాలో ప్రధాన లోపం. ముఖ్యంగా హీరో ఫ్రెండ్ గా నటించిన వ్యక్తి ప్రభాస్ కు బాబాయి లాగా ఉన్నాడు తప్ప ఫ్రెండ్ గా ఏ మాత్రం సెట్ అవ్వలేదు. అలాగే హీరో తల్లిగా మైనే ప్యార్ కియా ఫేమ్ భాగ్యశ్రీ ని సెలెక్ట్ చేయటాన్ని ఒక పిచ్చి సెలక్షన్ గా చెప్పాలి. అసలు ఆ పాత్ర డిజైనింగే చిరాకు తెప్పిస్తుంది. ఇందులో ఉండటానికి చాలా మంది ఆర్టిస్ట్ లు ఉన్నప్పటికి, సచిన్ ఖేడేకర్ కు మినహా.. ఎవరికీ చెప్పుకోతగ్గ పాత్రలు లేవు. జగపతిబాబు, జయరామ్, మురళీ శర్మ, ప్రియదర్శి, సత్యన్ వంటి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ, వాళ్ళందరినీ ఖరీదైన జూనియర్ ఆర్టిస్ట్ లు గానే నిలబెట్టాడు రాధాకృష్ణ.
ఇక ఈ సినిమాలోని మరో ప్రధాన లోపం మ్యూజిక్. ఇన్నేళ్లు శ్రమపడి, వెయిట్ చేసి ఒక లవ్ స్టోరీతో ముందుకు వచ్చిన హీరో ప్రభాస్, దర్శకుడు రాధాకృష్ణలకు ఆడియో మీద అంత అశ్రద్ధ ఏమిటో అర్థం కాదు! చరిత్రలో గొప్ప హిట్స్ గా నిలిచిన లవ్ స్టోరీలు అన్నీ మ్యూజికల్ హిట్స్ అన్న బేసిక్ పాయింట్ ను వీళ్ళు ఎలా మిస్ అయ్యారో అర్థం కాదు! ఒకటి కాకపోతే ఒక్కటైనా వినసొంపుగా అనిపించిన పాట లేకపోవడం రాధే శ్యామ్ కు పెద్ద డ్రా బ్యాక్. ఒక సినిమా విజయంలో సగభాగాన్ని నిర్ధారించేది ఆడియో. మరి.. మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ ఇంత వీక్ ట్యూన్స్ ఎలా ఇచ్చాడో వీళ్ళు ఎలా ఓకే చేసుకున్నారో అర్థం కాదు. అయితే.. పాటలు ఎలా ఉన్నప్పటికీ తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను నిలబెట్టాడు. ఇక కెమెరా, ఎడిటింగ్ వంటి అన్ని విభాగాలు ‘అప్ టూ ద మార్క్ ‘ అనిపించాయి. అయితే రాధే శ్యామ్ విషయంలో ప్రత్యేక ప్రశంస దక్కవలసిన టెక్నీషియన్ ఒకరున్నారు. అతనే ఆర్ట్ డైరెక్టర్ రవీందర్. 1970స్ నాటి ఇంగ్లీష్ నేపథ్యాన్ని, టౌన్షిప్ ను, ఇంటీరియర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్ది “ద రియల్ హీరో” బిహైండ్ ద స్క్రీన్ అనిపించుకున్నాడు రవీందర్. ఇక మేకింగ్ స్టాండర్డ్స్ విషయంలో యువి క్రియేషన్స్ అండ్ గోపి కృష్ణ మూవీస్ వారి నిర్మాణ ప్రమాణాలకు ప్రశంసలే తప్ప విమర్శలకు తావు ఉండదు.
ఇక పర్ఫార్మెన్స్ విషయంలో హైలీ కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ లో ప్రభాస్- పూజా హెగ్డే నువ్వా నేనా అన్నట్లుగా చేశారు. బ్లైండ్ ఆస్ట్రాలజర్ పరమహంస పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు చాలా స్పెషల్ గా, సెటిల్డ్ గా కనిపించారు.
మొత్తం మీద అక్కడక్కడా బోర్ కొట్టించినప్పటికి అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకునే డిఫరెంట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. అది థియేటర్ లోనే చూడాల్సిన విజువల్ ఫీస్ట్.
అన్నట్టు చివరిగా డార్లింగ్ ప్రభాస్ కు ఒక చిన్న రిమైండర్…
బాహుబలి సిరీస్ లో అద్భుతమైన ఫిట్ నెస్ తో కనిపించిన మీ ఫేస్, మీ బాడీ.. కొంత షేప్ ఔట్ అవుతున్నట్లు కనిపించాయి ప్లీజ్ టేక్ కేర్ డార్లింగ్. థాంక్యూ.