ప్రస్తుతం రీ రిలీజ్ ల పర్వం నడుస్తోంది. ఇప్పటికే మన హీరోల ఒకప్పటి సినిమాలు మరోసారి థియేటర్స్ లో విడుదలై కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన ఒక సినిమా రీ రిలీజ్ కి సిద్ధమైంది. అది కూడా ప్లాప్ మూవీ. మరి ఆ సినిమా ఏంటి? ఎప్పుడు విడుదలవుతుంది?
ఒకప్పటిలా హీరోలు ఇప్పుడు లేరు. అందరూ పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. ప్రభాస్ తో మొదలైన ఈ పర్వం తెలుగు హీరోలందరూ కొనసాగించేలా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఏ సినిమా చేసినా గానీ మినిమమ్ పాన్ ఇండియా అయి ఉండాలని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్.. పుష్పతో అల్లు అర్జున్, దసరాతో నాని, కార్తికేయ-2తో నిఖిల్ సిద్దార్థ్, లైగర్ తో విజయ్ దేవరకొండ ఇలా వీరంతా పాన్ ఇండియా లెవల్ లో తమను తాము పరిచయం చేసేసుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్, రామ్ పోతినేని, తేజ సజ్జ వంటి హీరోలు కూడా రెడీ అయిపోతున్నారు. ఇక ప్రభాస్ అయితే సలార్, ప్రాజెక్ట్ కే వంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.
పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు రీ రిలీజ్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఒకప్పుడు అట్టర్ ప్లాప్ అయిన ఆరెంజ్ సినిమాకి ఆ మధ్య రిలీజ్ చేయగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో వచ్చాయి. ప్లాప్ సినిమాలని కాదు గానీ ఒకప్పుడు మన స్టార్స్ నటించిన బ్లాక్ బస్టర్స్ ని కూడా మరోసారి రిలీజ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఒకప్పుడు రిలీజైన సినిమాల హిట్, ప్లాప్ రిజల్ట్ తో సంబంధం లేకుండా ఇప్పుడున్న క్రేజ్ కి ఏ హీరో సినిమా రిలీజ్ చేసినా సూపర్ హిట్ టాక్ తో పాటు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో వచ్చినవే ఖుషి, సింహాద్రి, ఒక్కడు, జల్సా, పోకిరి, బిజినెస్ మేన్, వర్షం, బిల్లా వంటి సినిమాలు. థియేటర్స్ లో రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టాయి.
తాజాగా ప్రభాస్ కెరీర్ లో ప్లాప్ గా నిలిచిన మరో సినిమా రీ రిలీజ్ కి సిద్ధమైంది. 4కే వెర్షన్ లో ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అది వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన యోగి సినిమా. ఈ సినిమా 2007లో జనవరి 14న విడుదలైంది. రిలీజ్ కి ముందు అప్పట్లో విపరీతమైన ఆసక్తిని రేపింది. ప్రభాస్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్పట్లో ఈ సినిమా 250కి పైగా థియేటర్స్ లో రిలీజై దాదాపు 13 కోట్ల రూపాయలను వసూలు చేసింది. సినిమా బడ్జెట్ 20 కోట్లు కావడంతో నష్టాలను మిగిల్చింది. ఆ తర్వాత ఈ సినిమా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో డబ్ చేసి విడుదల చేశారు. అయినా కూడా ప్లాప్ గా నిలిచింది. అయితే ఈ సినిమాని 4కే వెర్షన్ లో రీ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఆగస్టు 18న 4కే టెక్నాలజీతో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీతో ఈ సినిమాని మరలా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. ప్రభాస్ సరసన నయనతార నటించగా.. ప్రభాస్ తల్లిగా శారదా నటించారు. ఇందులో ముమైత్ ఖాన్ చేసిన ఐటం సాంగ్ అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. యోగి సినిమాతో పాటు అదే రోజున ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్, రవి కృష్ణ నటించిన 7/జి బృందావన కాలనీ సినిమాలు రీ రిలీజ్ కు సిద్ధమయ్యాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్లే. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలాంటి ఈ రెండు సినిమాల ప్రభావాన్ని తట్టుకుని యోగి సినిమా నిలబడుతుందా? ప్రభాస్ కున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా రీ రిలీజ్ తో రికార్డులను క్రియేట్ చేస్తుందా.. భారీ కలెక్షన్స్ ని రాబట్టి సాలిడ్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Up coming Re Release Movies
👉#Yogi on 18th Aug
👉#RaghuvarunBTech on 18th Aug
👉#7GBrindavanColony Release Date Soon pic.twitter.com/ERnXXNBZzb— T2BLive.COM (@T2BLive) August 8, 2023