టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు అశేష జనవాహిని కన్నీటి వీడ్కోల మధ్య పూర్తయ్యాయి. కృష్ణంరాజు మరణంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడిన కృష్ణంరాజు.. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇక జూబ్లీ హిల్స్ లోని ఇంటివద్ద కృష్ణంరాజు భౌతిక కాయానికి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు హాజరై అశ్రునివాళులు అర్పించారు. ఇక సోమవారం మొయినాబాద్ లోని ఫార్మ్ హౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగాయి.
ఈ క్రమంలో కృష్ణంరాజు అంతిమ సంస్కారాలు ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ చేతుల మీదుగా జరిగినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించారు. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కి చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం జూబ్లీ హిల్స్ నుండి మొదలైన అంతిమయాత్రకు భారీ స్థాయిలో రెబల్ స్టార్ అభిమానులు పాల్గొన్నారు. అలాగే అభిమాన నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు చివరి చూపు కోసం ఫ్యాన్స్ పెద్దఎత్తున ఫామ్ హౌజ్‌కు తరలివచ్చారు.
ఈ నేపథ్యంలో కృష్ణంరాజు పార్థివదేహాన్ని భుజాలపై మోసింది శ్యామలాదేవి. జూబ్లీ హిల్స్ లోని ఇంటి నుండి కృష్ణంరాజు పార్థీవ దేహాన్ని ఫామ్ హౌజ్‌కు తరలించడానికి ముందు ఆయన సతీమణి శ్యామలాదేవి దుఃఖంతో కంటతడి పెట్టుకొని బోరున విలపించిన దృశ్యాలు రెబల్ స్టార్ అభిమానులను కలిచి వేస్తున్నాయి. శ్యామలాదేవి భర్త పార్థివ దేహాన్ని చూసి బాధాతప్త హృదయంతో స్వయంగా ఆమె భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లడం జరిగింది.