సినీ సెలెబ్రిటీలు స్టేజీల మీద చెప్పలేని కొన్ని విషయాలను సమయం, సందర్భం వచ్చినప్పుడు బయట పెట్టేస్తుంటారు. ఒకరి గురించి కామెంట్స్ చేయాలని అనుకోకున్నా చెప్పిన మాటలు మాత్రం వివాదాస్పదంగా మారుతుంటాయి. ఇదివరకు చాలామంది సెలెబ్రిటీలు ఇలాంటి విషయాల్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాస్ రాజా రవితేజ పేరు వచ్చి చేరింది.
వివరాల్లోకి వెళితే.. రవితేజ కెరీర్లో భారీ ప్లాప్ గా నిలిచిన సినిమాల్లో `అమర్ అక్బర్ ఆంటోని` ఒకటి. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మోస్తరు అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి పెద్ద డిజాస్టర్ అయింది. అటు రవితేజకి, ఇటు శ్రీనువైట్లకి ఖచ్చితంగా హిట్టు పడాల్సిందే.. అనుకున్న సమయంలో విడుదలైన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత రవితేజ చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయాడు. కానీఅనూహ్యంగా డైరెక్టర్ శ్రీనువైట్లకి మాత్రం ఎలాంటి ఆఫర్స్ లేకుండాపోయాయి. ఇటీవల బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో పాల్గొన్న రవితేజ.. `అమర్ అక్బర్ ఆంటోని` సినిమా పై ఓ రేంజిలో సెటైర్లు వేశాడట.ఈ షోలో బాలయ్య స్క్రీన్ మీద ఓ ఫోటో చూపించి దాని గురించి చెప్పాలని అడగగా.. ‘అది అమెరికాలో ఒక కళాఖండం లాంటి సినిమా షూటింగ్ టైంలో తీసిన ఫొటో. ఆ కళాఖండం పేరు తెలుసుకోవాలనుందా మీకు? అమర్ అక్బర్ ఆంటోని. అది పెద్ద కళాఖండం’’ అని ఊహించని విధంగా కామెంట్ చేశాడు రవితేజ. బాలయ్య కంటిన్యూ చేస్తూ.. ‘ఇందులో నువ్వు అమరా, అక్బరా, ఆంటోనీనా?’ అని బాలయ్య అడిగాడు. “మూడూను.. ఆ సినిమా చూడలేదా మీరు. మీరేం మిస్సయిపోలేదు. చూడక్కర్లా’’ అని రవితేజ అనగానే.. ‘ఏంటి రాడ్ రంబోలానా?’ అని బాలయ్య అన్నాడు. వెంటనే రవితేజ అందుకొని.. “మాములు రాడ్ కాదు.. రాడ్డులకే రాడ్డు” అన్నాడు.
ఎంత డిజాస్టర్ అయినప్పటికీ.. ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా పై రవితేజ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు నెటిజన్లు. అంతకుముందు శ్రీనువైట్ల రవితేజకి నీకోసం, వెంకీ, దుబాయ్ శీను లాంటి సూపర్ హిట్స్ అందించాడు. అవన్నీ మరిచి ఇలా దర్శకుడిని అవమానించడం సరైన పద్ధతి కాదని విమర్శిస్తున్నారు శ్రీనువైట్ల అభిమానులు. అసలు రవితేజకు కృతజ్ఞత అనేది లేదని, శ్రీనువైట్ల పై గౌరవం లేదా? అని నిలదీస్తున్నారు. మరి దీనిపై శ్రీనువైట్ల ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే రవితేజ మాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరి మాస్ రాజా వివాదాస్పద వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.