పుష్ప ది రైజ్.. సినిమా రంగంలో ఇప్పటికీ ఈ పేరు రీసౌండింగ్ ఇస్తూనే ఉంది. అల్లు అర్జున్ స్థాయిని స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మార్చేసింది. పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్‌కు బ్రహ్మాండమైన మార్కెట్ క్రియేట్ చేసింది. ఇటీవలే రష్యాలో కూడా ఈ సినిమాని విడుదల చేయడం.. సినిమా బృందం మొత్తం అక్కడ ప్రమోషన్స్ నిర్వహించడం చూశాం. టాలీవుడ్ ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులే పుష్ప-2 సినిమా కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు కథలో సుకుమార్ మార్పులు కూడా చేసినట్లు ఇప్పటికే విన్నాం. అయితే ఇప్పుడు కొత్త వార్త ఒకటి వినిపిస్తోంది. పుష్ప-2 క్లైమాక్స్ లీకైందని.. అందులో రామ్ చరణ్ నటించబోతున్నాడంటూ చెబుతున్నారు.
పుష్ప ది రైజ్ సమయంలోనే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఆ సమయంలో సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి సుకుమార్ కడా ఆశ్చర్యపోయారు. పార్ట్ 2 విషయంలో మొదట అనుకున్న కథకి మార్పులు కూడా చేశారంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకూడదు అంటూ సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతోందని చెబుతున్నారు. సినిమా కథ మాత్రమే కాదు.. టేకింగ్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్లు హామీ ఇస్తున్నారు. అయితే ఈ తరుణంలో క్లైమాక్స్ లీక్ అంటూ వినిపిస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
పుష్ప ది రూల్ సినిమాలో క్లైమాక్స్ లో రామ్ చరణ్‌ని పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈ విషయం జోరుగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా మనకు ఒక సినిమాలోనే ఇద్దరు ముగ్గురు స్టార్లు ఉండటం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. కొందరు డైరెక్టర్లు అయితే హాలీవుడ్ రేంజ్‌లో తమ యునివర్స్ లను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ తరహాలోనే సుకుమార్ ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. క్లైమాక్స్ లో రామ్ చరణ్- పుష్పాతో కలిసి పోరాడతాడట. ఆ తర్వాత రామ్ చరణ్ పాత్రను హైలెట్ చేస్తూ పుష్ప తర్వాతి పార్ట్‌ని ప్లాన్ చేయబోతున్నారు అంటూ గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎక్కడా కూడా అధికారిక ప్రకటనలు అయితే లేవు. ఒకవేళ అదే జరిగితే మాత్రం పుష్ప-2 సినిమా స్థాయి ఇంకా పెరిగిపోతుందని చెబుతున్నారు.