సాధారణంగా తమ ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం ప్రైవేట్ కంపెనీలు సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్స్ గా సెట్ చేసుకుంటాయి. వాళ్ళ పేరు, ఫోటోలను ప్రమోషన్స్ కోసం వాడినందుకు సెలబ్రిటీలకు ఒప్పందం ప్రకారం మాట్లాడుకున్న అమౌంట్ ని కంపెనీలు చెల్లిస్తుంటాయి. అయితే.. సెలబ్రిటీలను అప్రోచ్ అయి.. వారి అనుమతితో ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడంలో తప్పులేదు. ఒక్కోసారి కొన్ని కంపెనీలు కక్కుర్తికి పోయి.. ఆయా సెలబ్రిటీల పేర్లు, ఫోటోలను అనుమతి లేకుండా ఉపయోగించి డబ్బు చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి.
ఇలాంటి దొంగచాటు వ్యవహారాలు తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలతో ప్రచారం చేసుకుంటున్నారని తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ రియాక్ట్ అయ్యారు. ఏకంగా తన లాయర్ ద్వారా తన ఫోటోలు, పేరు, మాటలు ఎక్కడా వాడకూడదని పబ్లిక్ నోటిస్ ప్రకటించారు. ఒకవేళ వీటిని క్రాస్ చేస్తే.. అది సెలబ్రిటీల పర్సనల్ హక్కులను ఉల్లంఘించినట్లే అని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం రజినీ పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నందువల్ల ఇలా దొంగచాటుగా ఆయన పేరును ప్రచారానికి వాడుతున్నారని ఆయన దృష్టిలో పడటంతో రజినీ లాయర్ కి ఇన్ఫర్మ్ చేశారట.
ఇక లాయర్ ఎలం భారతి రిలీజ్ చేసిన నోటీసులో.. ‘సూపర్ స్టార్ రజినీకాంత్ సెలెబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి. వాణిజ్య పరంగా రజనీకాంత్ వ్యక్తిత్వం, పేరు, మాటలు, ఫొటోలను ఉపయోగించే హక్కులను కేవలం ఆయనే అనుమతిస్తారు. కొన్ని వేదికలు, ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకునేవారు.. ఆయన అనుమతి లేకుండా పేరు, మాటలు, ఫోటోలు, పోస్టర్లను ఉపయోగిస్తున్నారు. అలా చేస్తూ ప్రోడక్ట్ లను సేల్ చేసే చర్యలకు దిగితున్నారు. రజినీకాంత్ గొప్ప నటుడేగాక మానవతావాది కావడంతో.. వరల్డ్ వైడ్ ఆయనని కోట్లాది జనాలు అభిమానిస్తున్నారు. ఆయన ప్రతిష్ఠను లేదా వ్యక్తిత్వాన్ని ఏ విధంగా దెబ్బతీయాలని చూసినా.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు.