చిత్రరంగంలోకి ఎందరు వచ్చిపోతున్నా.. కొందరు మాత్రమే తమ ప్రతిభతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తారు. అలాంటి వారిలో నటి రాధా ప్రశాంతి ఒకరు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్‌తో పాటు జీవితం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సినీ పరిశ్రమలోకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసు గెలుచుకుంటారు. అలాంటి వారిలో నటి రాధా ప్రశాంతి ఒకరు. అందంతో పాటు తనదైన అభినయంతోనూ ఆమె అభిమానులను సంపాదించుకున్నారు. ప్రశాంతి హావభావాలతో పాపులర్ అయ్యారు. ఉన్నది ఉన్నట్లుగా, ముక్కుసూటిగా మాట్లాడే ఫైర్ బ్రాండ్‌గా ఆమెకు పేరుంది. భయం అంటే ఏంటో తెలియదని చెప్తూ ఉండే రాధా ప్రశాంతి.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కాశీనగర్‌లో పుట్టారు. ఆమె అసలు పేరు కృష్ణవేణి. తొమ్మిదో తరగతిలోనే చదివించేవాళ్లు లేకపోవడంతో ఆమె చదువుకు దూరమయ్యారు. స్టేజీ మీద డ్రామాలు చేస్తూ నెమ్మదిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు.
‘పెళ్లిపందిరి’, ‘పెళ్లికానుక’, ‘లవకుశ’ లాంటి చిత్రాల్లో రాధా ప్రశాంతి నటించారు. హీరోయిన్గా, సెకండ్ హీరోయిన్గా, సపోర్టింగ్ హీరోయిన్‌గానూ ఆమె పాత్రలు పోషించారు. రెండు దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్కు దూరమైన రాధా ప్రశాంతి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తమ ఇంట్లో అందరూ ఫైర్బ్రాండ్సేనని.. తాను కాలేజీకి వెళ్లే బస్సు ఇంటి ముందు ఆపడం లేదని తన అన్నయ్య ఏకంగా బస్సునే తగలబెట్టాడని రాధా ప్రశాంతి చెప్పారు. హీరోయిన్గా మంచి ఆఫర్లు వస్తున్న టైమ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి అనే బిజినెస్‌మేన్‌ను పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నారు.
కిరణ్ కుమార్ తనను చూసి ఇష్టపడ్డారని.. తన నంబర్ తీసుకుని రాత్రిళ్లు ఫోన్ చేసేవారని రాధా ప్రశాంతి అన్నారు. పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడని.. తాను నో చెప్పడంతో నిద్రమాత్రలు మింగి మూడంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకాడన్నారామె. ‘కిరణ్‌కు నేను నో చెప్పడానికి ఓ కారణం ఉంది. చిన్నప్పటి నుంచి మేం ఎన్నో కష్టాలు చూశాం. నటిగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన టైమ్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు నన్ను మ్యారేజ్ చేసుకుందామని మా ఇంటి ముందుకు వచ్చేవారు. నాకు మాత్రం పెళ్లిపై ఆసక్తి ఉండేది కాదు. కానీ చివరకు నా కోసం ప్రాణాలు తీసుకోవడానికి రెడీ అయిన కిరణ్ కుమార్‌ను వివాహం చేసుకున్నా. పెళ్లయ్యాక రామానాయుడు నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ నా భర్త నటించేందుకు ఒప్పుకోలేదు’ అని రాధా ప్రశాంతి చెప్పుకొచ్చారు. కరోనా టైమ్‌లో తన ఇల్లు తగలబడిపోయిందని.. అది ప్రమాదవశాత్తూ జరగలేదన్నారామె. కొందరు కావాలనే ఇలా చేశారని ఆమె ఆరోపించారు.