ఎన్నో ఆశలతో హీరోయిన్ అవ్వాలని సినీ పరిశ్రమలో అడుగు పెడితే పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె హెయిర్ తో బిజినెస్ చేయడం ప్రారంభించింది. రూ. 1300తో మొదలుపెట్టి ఇవాళ కోట్లలో సంపాదిస్తోంది. ఈమె తెలుగులో నాగశౌర్యతో ఒక సినిమాలో కూడా నటించిందండోయ్. ఆమె ఎవరంటే?
ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కంది. మొదట్లో అవకాశం వచ్చింది. మంచి గుర్తింపు కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత అవకాశాలు రాలేదు. రాక రాక అవకాశం వస్తే జుట్టు పొట్టిగా ఉందని వద్దన్నారు. హెయిర్ ఎక్స్ టెన్షన్ కోసం ప్రయత్నిస్తే కుదరదన్నారు. దీంతో ఆమె విగ్గుల వ్యాపారం చేయాలనుకుంది. చుట్టాలు, చుట్టుపక్కలోళ్లు, స్నేహితులు విగ్గుల వ్యాపారం చేస్తావా? ఛీ అన్నారు. అయినా సిగ్గు పడకుండా విగ్గుల బిజినెస్ మొదలుపెట్టి ఇప్పుడు కోట్లు సంపాదిస్తోంది. సినిమాల్లోనూ నటిస్తోంది. తెలుగులో నాగశౌర్య సరసన ఓ సినిమాలో కూడా నటించింది. ఆమె మరెవరో కాదు, పారుల్ గులాటి.
అప్పట్లో హర్యానాలోని ఆడపిల్లను పుట్టనివ్వనటువంటి రోహతక్ గ్రామం అది. చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అనేవి ఆ గ్రామంలో బూతుమాటలతో సమానం. పెళ్లయ్యాక ఆడపిల్లలు ఎలా ఉండాలి, మెట్టినిల్లుని ఎలా చక్కబెట్టుకోవాలి, భర్త, అత్తామామలను ఎలా చూసుకోవాలి.. ఇవే ఒక వయసొచ్చాక నేర్పించే గ్రామం అది. అలాంటి గ్రామంలో పారుల్ గులాటీ జన్మించింది. ఎలాగోలా చదువును కొనసాగించింది. అదృష్టవశాత్తు ఫేస్ బుక్ లో ఆమె ఫోటోలను చూసి ఓ యాడ్ ఏజెన్సీ వారు సంప్రదించారు. తల్లి సహాయంతో పారుల్ ముంబై వెళ్ళింది. 2007లో ఓ కమర్షియల్ యాడ్ లో నటించింది. ఆ తర్వాత నటన మీద ఆసక్తితో లండన్ లోని ది రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్ లో శిక్షణ తీసుకుంది.
శిక్షణ పూర్తి చేసుకుని తిరిగొచ్చాక 2010లో ‘ఏ ప్యార్ న హోగా కమ్’ హిందీ సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ తో ఆమెకు మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత పంజాబీ సినిమాలో నటించింది. అది ప్లాప్ అయ్యింది. ఏడాది గడుస్తున్నా ఒక్కరూ అవకాశాలు ఇవ్వడం లేదు. బరువు పెరిగిపోతే సన్నబడింది, జుట్టు కత్తిరించుకుంది. ఆ సమయంలో వెబ్ సిరీస్ లో నటించాలని కాల్ వచ్చింది. చాలా సంతోషించింది. కానీ జుట్టు పొట్టిగా ఉందని నో చెప్పారు. దీంతో పారుల్ చాలా బాధపడింది. హెయిర్ ఎక్స్ టెన్షన్ కోసం అడిగితే సాధ్యం కాదని అన్నారు. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ‘నిష్ హెయిర్’ పేరుతో ఒక విగ్గుల వ్యాపారాన్ని స్థాపించింది.
సవరం, విగ్, హెయిర్ ఎక్స్ టెన్షన్స్ అంటే గతంలో చిన్న చూపు చూసేవారు. కానీ ఇప్పుడు అవే విగ్గులు, సవరాలు, హెయిర్ ఎక్స్ టెన్షన్లు ఎంతోమంది రోల్ మోడల్స్ కి అవసరం. ఇప్పుడు వీటికున్న డిమాండ్ వేరే. అందుకే మార్కెట్లో ఉండే సింథటిక్స్ కన్నా నిజమైన జుట్టుతో హెయిర్ ఉత్పత్తులు చేయాలనుకుంది పారుల్. మరి వ్యాపారం మొదలుపెట్టినప్పుడు వద్దని చెప్పే వంకాయ గాళ్ళు, చూసి నవ్వుకునే నీచులు లేకపోతే సక్సెస్ ఎలా వస్తుంది చెప్పండి. ఈమె స్నేహితులు, బంధువులు కూడా ఇదేం పని అని.. ఎవరిదో జుట్టు కొని తెచ్చుకుని పట్టుకుంటావా? వాటిని శుభ్రం చేస్తావా? వాక్ తూ.. నీకు మైండ్ పోయిందా అని గాలి తీసే పని చేశారు. అయితే పారుల్ అవేమీ పట్టించుకోకుండా సిగ్గు పడకుండా విగ్గుల బిజినెస్ మొదలుపెట్టింది. ఆ బిజినెస్ దినదినాభివృద్ధి చెందింది.
ఇప్పుడు ఆమె తయారు చేసిన హెయిర్ ఉత్పత్తులను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎంతోమంది వినియోగిస్తున్నారు. క్లాసిక్, ప్రీమియం, కర్లీ హెయిర్ ఎక్స్ టెన్షన్స్, హెయిర్ టాపర్స్, విగ్గులను.. ఈమె నిష్ హెయిర్ అనే కంపెనీ ద్వారా విక్రయిస్తోంది. ప్రస్తుతం నెలకు రూ. 70, 80 లక్షల వరకూ సంపాదిస్తుంది. వ్యాపారం చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది. అందరూ తనను హేళన చేస్తే ఆమె తల్లి మాత్రం పారుల్ ని ఎంతగానో ప్రోత్సహించింది. అమ్మ ప్రోత్సహాంతో రూ. 1300తో విగ్గుల వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఇవాళ కోట్లు సంపాదిస్తుంది. వందకు పైగా ప్రకటనల్లో నటించిన పారుల్ గులాటి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇంతకే నాగశౌర్యతో చేసిన సినిమా పేరు చెప్పలేదు కదూ.. అది ‘నీ జతలేక’ అనే సినిమా. 2016లో రిలీజ్ అయ్యింది.