ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు దక్కించుకోవడం పట్ల పెద్ద ఎత్తున ప్రశంసలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్ గెలవడంతో.. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం తెలియాలంటే.. ఇది చదవండి..
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సాధించిన రికార్డులు.. వసూళ్ల చేసిన కలెక్షన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. 2022, మార్చి 24 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు రాజమౌళి అంటేనే విజయానికి కేరాఫ్ అడ్రెస్. అలాంటి దర్శక ధీరుడి డైరెక్షన్‌లో, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు, ఆలియా భట్ వంటి అందాల నటితో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే ప్రభంజనాలు సృష్టించింది. ఇక సినిమా విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్‌గా నిలవడమే కాక.. కలెక్షన్ల వసూళ్లలో సైతం సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆర్‌ఆర్‌ఆర్ క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇక తాజాగా ఆస్కార్ అవార్డ్‌తో రాజమౌళితో పాటు తెలుగు వారి ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఇక ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు అవార్డ్ రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
ఇక ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. దీనిపై ప్రశంసలు కురిపిస్తూనే మరో కొత్త చర్చకు తెరలేపారు. ఇప్పటికే తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ వంటి వారు.. సౌత్ సినిమాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని విమర్శలు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను కాదని గుజరాత్ ‘ఛెల్లో షో’ సినిమాను ఆస్కార్‌కు పంపండంతో కేంద్రం వైఖరి స్పష్టమైంది అంటున్నారు. గుజరాత్ సినిమా కాబట్టే ‘ఛెల్లో షో’ను ఆస్కార్‌కు పంపారు.. కానీ ఫలితం చూశారు కదా అంటూ మండి పడుతున్నారు. నెటిజనులు కూడా కొందరు ఈ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. అంతేకాక.. నిజంగానే ‘ఛెల్లో షో’ని కాకుండా ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్‌కు పంపిస్తే.. నేడు ఇండియా ఖాతాలో మరో అవార్డు చేరి ఉండేది కదా.. ఈ విషయంలో కేంద్రం తప్పు చేసింది అని వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఆస్కార్ అవార్డుల కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎఫ్‌ఐ) ఏటా మన దేశం నుంచి ఆ ఏడాది వచ్చిన బెస్ట్ 14 సినిమాలను షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఆ తర్వాత పదహారు మంది సభ్యులున్న ఇండియన్ సబ్మిషన్ ఫర్ ఆస్కార్ జ్యూరీ ఒక సినిమాను భారత్ నుంచి అధికారికంగా సెలెక్ట్ చేసి ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో పంపిస్తారు. అలా ఈ ఏడాదికి గాను ఛెల్లో షోని సెలక్ట్ చేశారు. ఈ జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు కశ్మీర్ ఫైల్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి.
ఛెల్లో షో అనే సినిమా ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. 2021 ఛెల్లో షో సినిమా విడుదల అయ్యింది. దాన్ని 2022, 2023 గాను రెండు సార్లు ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ చేశారు. 2022 ఆస్కార్స్ కోసం ఛెల్లో షోని షార్ట్ లిస్ట్ చేశారు. కానీ అప్పుడు పక్కన పెట్టారు. ఈ ఏడాది ఏకంగా ఇండియా తరఫున ఆస్కార్ బరిలో ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో నిలిపారు. అయితే ఒకే చిత్రాన్ని ఇలా రెండు సార్లు షార్ట్ లిస్ట్ చేయడంపై అనేక విమర్శలు వచ్చాయి.
ఆస్కార్ నిబంధనల ప్రకారం.. అధికారికంగా ఏదైనా దేశం నుంచి వచ్చే సినిమా మరుసటి ఏడాది మళ్లీ ఏ విభాగంలోనూ పోటీకి రాకూడదు. అయితే ఛెల్లో షో సినిమా గత ఏడాది అఫీషియల్ సబ్మిషన్ కాలేదు కాబట్టి.. ఈసారి పంపించి ఉంటారు. మరి గతంలో ఏదైనా సినిమాను ఇలా వరుసగా రెండేళ్లు ఆస్కార్ కోసం పరిశీలించారా అనే అంశంపై ఎక్కడా స్పష్టత లేదు. దాంతో దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. ఆర్‌ఆర్‌ఆర్, కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలను కాదని.. ఛెల్లో షోని పంపడం ఏంటని విమర్శలు వచ్చాయి. సరే ప్రభుత్వం నిర్ణయం కాబట్టి మనం ఏం అనలేం.
దాంతో రాజమౌళి రంగంలోకి దిగారు. పట్టువదలని విక్రమార్కుడిలాగా.. ప్రయత్నాలు చేశారు. తన బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సాయంతో ఆర్‌ఆర్‌ఆర్‌ని విదేశాల్లో ప్రదర్శించి.. అక్కడి ప్రేక్షకులకు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చేరువ చేశారు. రాజమౌళి ప్రయత్నం ఫలించి.. పలు అంతర్జాతీయ అవార్డులు ఆర్‌ఆర్‌ఆర్‌కు దాసోహం అవుతూ వచ్చాయి. ఈ చిత్ర ప్రభావం హాలీవుడ్‌లో ఒక ఫీవర్ లాగా వ్యాపించింది. ఫైనల్‌గా రాజమౌళి పట్టుదల కారణంగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ కావడమే కాక.. ఏకంగా అవార్డ్ కూడా గెలుచుకుంది.
ఈ క్రమంలో నెటిజనులు.. అసలు ఇండియా నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ను ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో భాగంగా అధికారిక చిత్రంగా పంపి ఉంటే.. ఈ రోజు మనకు ఇంకో అవార్డ్ వచ్చేది కదా.. అంటూ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై నెటిజనులు విమర్శలు కురిపిస్తున్నారు. అంతేకాక నాడు ఆర్‌ఆర్‌ఆర్‌ను నామినేట్ చేయకపోవడంపై ఎఫ్‌ఎఫ్‌ఐ వెటకారంగా బదులివ్వడం తెలుగు వారెవ్వరూ మర్చిపోలేదు. నేడు ఆస్కార్ అవార్డ్ రావడంతో.. ఇది మా రేంజ్.. మీ వక్రబుద్ధికి ఇదే మా సమాధానం.. మీకిది నాటైన చెంపపెట్టు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే ఆర్‌ఆర్‌ఆర్‌ను ఇండియా నుంచి అధికారిక ఎంట్రీలా పంపిస్తే.. మరో అవార్డు సాధించేదా.. ఈ విషమంలో కేంద్రం వివక్ష చూపిందా.. తప్పు నిర్ణయం తీసుకుందా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.