మెగాస్టార్ చిరంజీవి. దేశ సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో పల్లెటూరిలో పుట్టి, కళామతల్లి ఒడిలో చేరి, అంచలు అంచలుగా ఎదిగి, టాలీవుడ్ మెగాస్టార్ అయ్యారు. అయితే అంతటి ఘనకీర్తి ఆయనకు అంత సులువుగా రాలేదు. ఎన్నో కష్టనష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారు. ప్రశంసలుతో పాటు విమర్శలు తట్టుకుని నిలబడ్డారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి వాటి లోతుపాతులను చూశారు. స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా తాను అవమానాలు, అనుమానాలు ఎదుర్కొన్నట్లు స్వయంగా ఆయనే ఓ షోలో వెల్లడించారు.
సోనీ లివ్ నిర్వహిస్తున్న షో నిజం. నిర్భయంగా మాట్లాడదాం అనే ట్యాగ్ లైన్ తో ప్రారంభం కాబోతున్న ఈ షోకు నటి, పాప్ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ షో ప్రోమోను విడుదల చేసి, కార్యక్రమంపై హైప్ ను పెంచగా.. తాజాగా తొలి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఈ సందర్భంగా స్మిత పలు ప్రశ్నలు సంధించారు. కాలేజీ డేస్ లో మీ ఫస్ట్ క్రష్, స్టార్ డమ్ అనేది కొంత మందికే, ఆ స్టేజ్ కి వెళ్లాలంటే అనుమానాలు, అవమానాలు తప్పవా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన ఓ పరిస్థితిని గురించి వెల్లడించారు.
గతంలో ఓ సారి జగిత్యాలకు వెళ్లగా.. అభిమానులు పూల వర్షాన్ని కురిపించారని, మరింత ముందుకు వెళ్లగా కోడి గుడ్లతో కొట్టారని చెప్పారు. అదేవిధంగా వరప్రసాద్ (చిరంజీవి అసలు పేరు) నుండి మెగాస్టార్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంటారా అనే ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. ఈ తొలి ఎపిసోడ్ ను ఈ నెల 10న సోనీలివ్ ప్రసారం చేయనుంది. ఇప్పటికే ఈ షో ప్రోమోలో రాజకీయ నేత చంద్రబాబు నాయుడు, నటీనటులు నాని, రానా, సాయి పల్లవి, అల్లరి నరేష్, రాధిక, దర్శకులు అనిల్ రావిపూడి, దేవ కట్టా, సందీప్ వంగా పాల్గొని సందడి చేసినట్లు కనిపిస్తోంది.