సార్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది.. డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇండస్ట్రీలో ఇలాంటి రచయిత లేడని అన్నారు. ఆ మాటలే వివాదానికి దారి తీశాయి. నెటిజన్లు ఓ రేంజ్‌లో హైపర్ ఆదిపై ఫైర్ అవుతున్నారు.
‘‘త్రివిక్రమ్ శ్రీనివాస్ గారంటే నాకు చాలా చాలా ఇష్టం. ఒక రకంగా ఇన్‌స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. స్టేజి మీద ఇచ్చే స్పీచు కూడా పదేపదే చూసేలా చేసే ఒకే ఒక్క డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌గారు. మీరు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మీరు ఇచ్చిన స్పీచి చరిత్రలో ఇంకెవ్వరూ అలా ఇవ్వలేరు. అది గట్టిగా నమ్ముతాను. ఒక డైరెక్టర్‌కు హీరోకు ఉన్నంత క్రేజ్ ఉందంటే.. ఆయన రాసిన మాటల ప్రభావం అలాంటిది.. ఆ మాటల ప్రవాహం అలాంటిది. బేసిక్‌గా మాటలకు మనిషి రూపం వస్తే.. అది మాట్లాడే మొదటి మాట ‘థాంక్యూ త్రివిక్రమ్ గారు’ అని. ప్రాసకు ఆశ కలిగి ఎవరినైనా చూడలి అనుకుంటే ఆ మొదటి ఫేసు కూడా త్రివిక్రమ్‌దే. ఒక వైట్ పేపర్‌కు న్యాయం చేయగలిగే ఏకైక రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు.
నాలాంటి వాళ్లు ఎంత మంది రాసినా ఆ పేపర్ ఇంకా ఏదో కావాలని కోరుకుంటుంది. అదే త్రివిక్రమ్ పేపర్ మీద పెన్ను పెడితే.. ఇది కదా నేను కోరుకుంది అని ఆ పేపర్ కూడా హ్యాపీగా ఫీలవుతుంది. మీది భీమవరం.. మీరు ఇండస్ట్రీకి రావటం మా అందరి వరం’’ బుధవారం జరిగిన సార్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై హైపర్ ఆది కురిపించిన పొగడ్తల వర్షం ఇది. ఈ పొగడ్తలే ప్రస్తుతం హైపర్ ఆదిపై విమర్శలకు కారణం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నెజటిన్లు హైపర్ ఆదిపై తీవ్ర స్థాయిలో పైర్ అవుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన రచయితలను తగ్గించినట్లుగా.. వారికంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గొప్ప అన్నట్లుగా ఆది మాటలు ఉండటమే.. ‘ఒక వైట్ పేపర్‌కు న్యాయం చేయగలిగే ఏకైక రైటర్ త్రివిక్రమ్’ అంటూ ఆది ఓ లెవల్ పొగిడేశారు.
ఆది అన్న ఈ మాటలకు పూర్తి అర్థం బహుశా ఆయనకే తెలిసి ఉండకపోవచ్చు. లేదా.. పొగడాలన్న ఉత్సాహంలో ఏదో అనేసి ఉండొచ్చు. కానీ, దీన్నే నెటిజన్లు తప్పుబడుతున్నారు. నెటిజన్ల అభిప్రాయం ప్రకారం.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కంటే ముందు చాలా మంది రచయితలు అద్భుతాలను సృష్టించారు. కేవలం వారి డైలాగులూ, పాటల కారణంగా సినిమాలు హిట్టు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆరుద్ర, ఆత్రేయ కావచ్చు.. గణేష్ పాత్రో.. జంధ్యాల కావచ్చు.. వీరి మాటల కారణంగా సినిమాలు హిట్లు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చరిత్రలో ఇప్పటికీ చెప్పుకుంటున్న డైలాగులు చాలా కూడా వీరు రాసినవే. ఆకలి రాజ్యం సినిమాలో గణేష్ పాత్రో రాసిన డైలాగులూ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ప్రముఖ రచయితల ద్వయం పరుచూరి బ్రదర్స్ మాటలు రాసిన సినిమాలు ఎలాంటి విజయాల్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్ ప్రస్తుతం అలవోకగా రాస్తున్న మాటల్ని 30 ఏళ్ల క్రితమే జంధ్యాల సినిమాకు పరిచయం చేశారు. కామెడీ టైమింగ్, ప్రాసలతో సినిమాను మరో లెవల్‌కు తీసుకుపోయారు. ఒకరకంగా త్రివిక్రమ్‌కు స్పూర్తి జంధ్యాల అని చెప్పొచ్చు. ఇక, పాటల రచనలో వేటూరి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి దిగ్గజాలు రాసిన ఆణిముత్యాలను తెలుగు తెర ఎప్పటికీ మర్చిపోలేదు. అలాంటి ఎంతో ఉత్తమోత్తములు ఉన్న ఇండస్ట్రీలో కేవలం త్రివిక్రమ్ పెన్నుపెడితేనే పేపర్ సంతోషిస్తుందని అనటం తప్పని నెటిజన్లు అంటున్నారు. సాధారణం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు కానీ, ఏదైనా కార్యక్రమానికి గెస్ట్‌లుగా వచ్చిన వారిని పొగుడుతూ కొన్ని మాటలు మట్లాడటం సర్వసాధారణం.
కానీ, అది ఎదుటి వ్యక్తిని లేదా సమూమాన్ని తక్కువ చేసేలా మాట్లాడటం మూర్ఖత్వం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అవకాశాల కోసమే ఆది ఈ విధంగా భజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడని అంటున్నారు. ఇంత అతి వ్యాఖ్యలు చేయటం అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సినిమా హీరోను పొగడటంలో తప్పులేదు.. కానీ, రచయితల విషయం వేరే. ఎవరి ప్రత్యేక వారికి ఉంటుంది. ఎవరికి వారి అభిమాన గణం ఉంటుంది. అలాగని మిగితా రచయితలను తక్కువ చేసి మాట్లాడటం ముమ్మాటికి తప్పేనని, హైపర్ ఆది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, హైపర్ ఆది వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.