నందమూరి తారకరత్న మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తారకరత్న ఇకలేరనే వార్త తెలుసుకుని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు, రాజకీయ నేతలు తారకరత్న మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నందమూరి తారకరత్న మృతితో టాలీవుడ్ ఇండష్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నందమూరి కుటుంబం నుంచి వచ్చి అభిమానుల హృదయాలు గెలుచుకున్న హీరోల్లో తారకరత్న కూడా ఒకరు. ఒకటో నంబర్ కుర్రాడు, యువరత్న, తారక్ వంటి ఎన్నో గొప్ప సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. రీఎంట్రీ తర్వాత 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ తో మంచి కంబ్యాక్ ఇచ్చారు. కానీ, ఇలా హఠాన్మరణం చెందడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 23 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది.. చివరకు తుదిశ్వాస విడిచారు. బెంగళూరు నుంచి తారకరత్న పార్థివ దేహాన్ని హైదరాబాద్ తరలించారు.
నందమూరి తారకర్న చాలా సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే అటు రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఇటీవల మొదలైన లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా తారకరత్న పాల్గొని లోకేష్ కు తన మద్దతు తెలియజేశారు. ఆ పాదయాత్రలో తారకతర్న అస్వస్థతకు గురవ్వగా.. బెంగళూరు హృదయాలయంలో 23 రోజులపాటు చికిత్స అందించారు. ఈ 23 రోజులు తారకరత్న కోమాలోనే ఉన్నారు. విదేశాల నుంచి నిపుణలను సైతం పిలిపించి వైద్యం అందించారు.
వైద్యానికి తారకరత్న శరీరం స్పందించడం లేదని వైద్యులు వెల్లడించారు. చివరికి శనివారం సాయంత్రం నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు ఇండస్ట్రీ మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆదివారం ఉదయం తారకరత్న పార్థివదేహాన్ని హైదరాబాద్ లోని నివాసానికి తరలించారు. ఆదివారం మొత్తం తారకరత్న భౌతికకాయాన్ని నివాసంలోనే ఉంచనున్నారు. సోమవారం ఉదయం అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో తారకరత్న పార్థివదేహాన్ని ఉంచనున్నారు. సోమవారం సాయంత్రం ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో నందమూరి తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తండ్రి చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.