అందమైన రంగుల ప్రపంచం. చేతినిండా డబ్బు. ఊహించని స్టార్ డమ్. సినీ పరిశ్రమలో అగ్ర నటీమణులకు దొరికిన వైభవం. ఇది ఓ వైపే. మరో కోణం కూడా ఉంది. గాసిప్స్, రూమర్స్ కారణంగా అనేక మంది హీరోయిన్ల జీవితాలు తలకిందులైన ఘటనలు కోకొల్లలు. ఒక్క గాసిప్ స్టార్ హోదా నుండి అథో : పాతాళానికి తొక్కేస్తుంది. సినిమా ఛాన్సులు దొరక్క ఫేడ్ అయిపోతుంటారు. వార్తా పత్రికల కాలం నాటితో పోలిస్తే.. సోషల్ మీడియా వచ్చాక ఆ గాసిప్స్ కు అంతే లేదు. అయితే ఆ సోషల్ మీడియా లేకే తన జీవితం నాశమైందని అంటోంది ఓ అందాల తార.
ఆమె మరెవ్వరో కాదూ బాలీవుడ్ అలనాటి నటి అను అగర్వాల్. ఆషికి మూవీతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ మోడల్, ఈ ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. తమిళంలో మణి రత్నం తెరకెక్కించిన తిరుడా తిరుడా (తెలుగులో దొంగ దొంగ)లో చంద్రలేఖ అంటూ ఆడిపాడింది. ఆ తర్వాత గజబ్ తమాషా, జనమ్ కుండ్లీ, రిటర్న్ ఆప్ జ్యువెల్ థీఫ్ చిత్రాల్లో నటించింది. 1999లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని కుదిపేసింది. సుమారు నెల రోజుల పాటు ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అనంతరం సినిమాలకు దూరమైంది.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంది. అప్పట్లో తాను ఓ వ్యక్తితో సహజీవనం చేశానని, అతడి తల్లి అందుకు అంగీకరించారని చెప్పింది. అయితే ఆమె స్నేహితులు తన గురించి చెడుగా చెప్పేవారని, వార్తా పత్రికల్లో వచ్చే తన గురించి వచ్చే గాసిప్స్ ను నమ్మి.. తనను అపార్థం చేసుకున్నారని తెలిపింది. దీంతో తన జీవితం నాశనమైందని, తాను స్వేచ్ఛను కోల్పోయానని, అదే సోషల్ మీడియా ఉండి ఉంటే కాస్తైనా నిజాలు తెలిసేవని పేర్కొంది. ప్రస్తుతం అను అగర్వాల్ యోగాలో శిక్షణనిస్తూ, సామాజిక కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు.