మురళీ మోహన్.. టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన అలనాటి హీరోల్లో ఈయన కూడా ఒకరు. ఎన్నో ఫ్యామిలీ హిట్స్, క్లాసిక్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. తర్వాత నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎదిగారు. రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు, సినిమా ఇండస్ట్రీకి సేవలు చేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో మురళీ మోహన్ నటించిన విషయం తెలిసిందే. ఇంక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేశారు అంటూ ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
దానికి బలం చేకూర్చేలాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన యాక్టింగ్ కెరీర్ గురించి మురళీ మోహన్ కామెంట్ చేశారు. ఇకపై తాతగా నటించబోతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. దానికి తగినట్లుగానే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో డాక్టర్ వేదాశ్రీ తాత క్యారెక్టర్ లో మురళీ మోహన్ కనిపించారు. ఇంక ఆ ఇంటర్వ్యూలోనే ఎన్నో విషయాలను పంచుకున్నారు. గతంలో మోహన్ బాబుతో జరిగిన గొడవ గురించి కూడా గుర్తు చేసుకున్నారు. తాము ఓసారి చొక్కాలు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్లినట్లు చెప్పారు. అందుకు మోహన్ బాబు కుమారుడు విష్ణు కారణమని చెప్పారు.
“సినిమా నటులతో ఒక క్రికెట్ టోర్నమెంట్ ప్లాన్ చేశాం. హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లను కెప్టెన్లుగా పెట్టాం. రెండు జట్లు ఒక్కో మ్యాచ్ ఆడి.. అందులో గెలిచిన వారు ఫైనల్ లో తలపడేలా ప్లాన్ చేశాం. టీమ్స్ కూడా ఫైనల్ అయిపోయాయి. ఉదయం మొదలైతే అర్ధరాత్రికల్లా పూర్తయ్యేలా షెడ్యూల్ చేశాం. చివర్లో మోహన్ బాబు వచ్చి విష్ణు కూడా ఆడతాడంటూ చెప్పారు. అందుకు నేను ఒప్పుకోలేదు. అప్పటికి విష్ణు యాక్టర్ కాదు. కేవలం సినిమా తారలతో ఈ క్రికెట్ మ్యాచ్ లు ఏర్పాటు చేశాం. హీరోల పిల్లలు, మేనల్లుళ్ల కోసం కాదని నేను కుదరదని చెప్పాను.”
“అప్పుడు మోహన్ బాబు సీరియస్ అయ్యారు. నేను అడిగితేనే నో అంటావా అన్నారు. నేను కూడా సీరియస్ అయ్యాను. ఆయన మీదకు వచ్చారో.. నేను వెళ్లానో తెలియదు. ఇద్దరం చొక్కాలు కూడా పట్టుకున్నాం. అక్కడున్న వాళ్లు తర్వాత మిమ్మల్ని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు అని చెప్పారు. రెండ్రోజుల తర్వాత మోహన్ బాబు గారే వచ్చి నాతో మాట్లాడారు.సారీ బ్రదర్ ఆరోజు ఆవేశంతో చేశాను అని చెప్పారు. ఆ తర్వాత మేమిద్దరం చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం. చాలా సందర్భాల్లో ఎదురుపడి పలకరించుకున్నాం” అంటూ మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.