మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగికంగా వేధించిన కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై ఛార్జ్ షీట్ దాఖలైంది. 2010లో గణేష్ మాస్టర్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్.. 2020లో గణేష్ మాస్టర్, ఆయన అసిస్టెంట్ లపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. ‘గణేష్ మాస్టర్ నన్ను నానా రకాలుగా వేధించాడు. అంతేగాక 2010 మేలో తనతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు. మాస్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పోర్న్ వీడియోలు చూపించాడు.
అతను చెప్పినట్లు చేస్తే ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో.. 6 నెలలలోపే ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ లో నా సభ్యత్వం రద్దు చేయించారు. ఆయన తన లేడీ అసిస్టెంట్ లతో నాపై దాడి కూడా చేయించాడు. ఆ లేడీ అసిస్టెంట్స్ నాపై దుర్భాషలాడి పరువు తీశారు. ఇదంతా గడిచాక నేను నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేశాను. తర్వాత వారిపై తగిన చర్యలు తీసుకోవాలని లాయర్ ని సంప్రదించాను’ అని సదరు లేడీ కొరియోగ్రాఫరు ఫిర్యాదులో వెల్లడించినట్లు సమాచారం.ఈ కేసులో గణేష్ మాస్టర్ తో పాటు అతని అసిస్టెంట్ లపై 354-ఎ, 354-సి, 354-డి, 509, 323, 504 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే.. గణేష్ ఆచార్య గురించి సౌత్ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా బాలీవుడ్ అతను చాలా పాపులర్ కొరియోగ్రాఫర్. అదీగాక ఇటీవలే తెలుగు పాన్ ఇండియా మూవీ పుష్పలో ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ పాటకు కొరియోగ్రఫీ చేశారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.