భారత చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. గతేడాది ఎంతోమంది లెజెండరీ పర్సనాలిటీలను కోల్పోయి బాధలో ఉన్న సినీ ప్రేక్షకులను మరో లెజెండరీ కన్నుమూసిన వార్త విషాదంలో ముంచేసింది. లెజెండరీ సింగర్ సుమిత్రా సేన్.. జనవరి 3న తెల్లవారుజామున కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 89 సంవత్సరాలు. కాగా, చాలాకాలంగా సుమిత్రా సేన్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని తెలుస్తోంది. బెంగాలీ చిత్రపరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు గాయనిగా సేవలందించిన సుమిత్రా సేన్ మరణవార్త అటు దేశవ్యాప్తంగా సంగీతప్రియుల హృదయాలను కలచివేస్తోంది.
ఇక సుమిత్రా సేన్ కోల్‌కతాలోని తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. ఈ వార్తను ఆమె కుమార్తె శ్రబాని సేన్ (ప్రఖ్యాత రవీంద్ర సంగీత్ ఆర్టిస్ట్) ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. శ్రబానీ సేన్ తన ఫేస్ బుక్ లో “అమ్మ ఈరోజు తెల్లవారుజామున మనందరినీ విడిచిపెట్టింది” అని రాస్తూ విషయాన్ని బరువెక్కిన హృదయంతో తెలిపింది. తాజా నివేదికల ప్రకారం.. గత నెలలో సుమిత్రా సేన్ కు జలుబు చేయడంతో ఆమెను డిసెంబర్ 29న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు తెలిపిన బ్రోంకోప్ న్యుమోనియా కారణంగా అప్పటికే సుమిత్రా సేన్ ఆరోగ్యం క్షీణించడంతో, కుటుంబసభ్యులు ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. అప్పటినుండి ఇంట్లోనే ఉంటూ చివరికి తుదిశ్వాస విడిచారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమిత్రా సేన్ కుమార్తె శ్రబానీ సేన్.. తన తల్లికి వయసు పైబడిందని, ఆమె వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది. ఇదిలా ఉండగా.. సేన్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. “దశాబ్దాల పాటు సంగీత ప్రేక్షకులను అలరించిన సుమిత్రా సేన్ ఆకస్మిక మరణంతో నేను చాలా బాధపడ్డాను. ఆమెతో నాకు చాలాకాలంగా చక్కటి సాన్నిహిత్యం ఉంది. 2012లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెకు ‘సంగీత మహాసమ్మన్’ అవార్డును అందించింది. ఆమె మృతి సంగీత ప్రపంచానికి తీర్చలేని లోటు. సుమిత్రా సేన్ కుమార్తెలు ఇంద్రాణి, శ్రబాని మరియు ఆమె అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను” అని బెనర్జీ అన్నారు.
ఇక సుమిత్రా సేన్ నాలుగు దశాబ్దాలుగా సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన వందలాది పాటలు ఆలపించారు. ఎన్నో సూపర్ హిట్ పాటలలో మేఘ్ బోలేచే జబో జాబో, తోమారీ జర్నతలర్ నిర్జోనే, సఖీ భాబోనా కహరే బోలే, అచ్ఛే దుఖో అచే మృత్యు వంటి బ్లాక్ బస్టర్ లను సైతం ఆమె గళం నుండే అందించారు. ప్రస్తుతం సుమిత్రా సేన్ మరణం పట్ల దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుకుంటున్నారు. అలాగే ఆమె పాడిన ఎన్నో వందలాది హిట్ సాంగ్స్ ని గుర్తు చేసుకుంటున్నారు. మరి లెజెండరీ సింగర్ సుమిత్రా సేన్ మృతిపట్ల మీ సంతాపాన్ని కూడా కామెంట్స్ లో తెలియజేయండి.
Eminent Bengali singer, Sumitra Sen passed away at the age of 89. The news was reported by her daughter, Srabani Sen. She was suffering for quite some time. May her soul rest in peace.#SumitraSen #RIP #musicbangla pic.twitter.com/J4T0KGrtg9
— Music Bangla (@musicbanglatv13) January 3, 2023