గాన కోకిల లతా మంగేష్కర్ కరోనాతో బాధపడుతూ ఫిబ్రవరి 6న మృతి చెందిన సంగతి తెలిసిందే. లత మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ముంబైకి వచ్చి.. లత అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు నిర్వహించారు. లత మృతి అనంతరం కేంద్రం రెండు రోజుల దేశ వ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించింది.
ఇది కూడా చదవండి : లతా మంగేష్కర్ ఆస్తుల విలువ ఎంత.. ఇప్పుడవి ఎవరికి చెందుతాయి..?
ఇక లతా మంగేష్కర్ మృతి తర్వాత ఆమె జీవితంలోని పలు అంశాలకు సంబంధించిన కథనాలు మీడియాలో వైరలవుతున్నాయి. లతా మంగేష్కర్ ఒంటరి జీవితం, ప్రేమ విఫలం, ఆమెపై విష ప్రయోగం, ఆమె సాధించిన రికార్డులు, గెలుచుకున్న అవార్డుల గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో గతంలో లతా మంగేష్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనీలో లత మరు జన్మ గురించి చేసిన వ్యాఖ్యలతో ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పకనే చెప్పనట్లు అయ్యింది.
ఇది కూడా చదవండి : గాన కోకిల లతా మంగేష్కర్‌కు పాక్ కెప్టెన్ నివాళి
ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రిపోర్టర్ లతా మంగేష్కర్ ని ఉద్దేశించి.. మరో జన్మ ఉంటే.. మళ్లీ గాయని లతా మంగేష్కర్ గానే జన్మిస్తారా అని ప్రశ్నిస్తాడు. అందుకు లత.. ‘‘లేదు.. మరో జన్మంటూ ఉంటే కచ్చితంగా లతా మంగేష్కర్ లా మాత్రం జన్మించను’’ అని అంటారు. అందుకు రిపోర్టర్ ఆశ్చర్యంతో ఎందుకలా అని ప్రశ్నించగా.. ‘‘లతా మంగేష్కర్ జీవితంలో ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నదే ఆమెకు మాత్రమే తెలుసు. అందుకు మరో జన్మంటూ ఉంటే.. లతా మంగేష్కర్ లా మాత్రం జన్మించను‘‘ అని తెలిపారు. ఈ వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ ప్రశాంతమైన చిరునవ్వు వెనక.. ఎన్ని కష్టాల సుడిగుండాలున్నాయో.. ఎన్ని బాధలు భరించిందో ఆమెకు మాత్రమే తెలుసు అని వీడియో చూసిన నెటిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.