తెలుగు చిత్రపరిశ్రమలో గత కొన్ని రోజుల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రత్యక్ష ఎన్నికలను తలపిస్తున్న ఈ ఎన్నికల్లో పోటీదారులు ఎవరికి వారు తమ టీంను ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికలకు ఇంకా కాస్త సమయం ఉన్నప్పటికీ ముందుగానే తమ ప్యానెల్ ను రెడీ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ ఎన్నికల రేసులోకి అందరికంటే ముందుగానే వచ్చిన ప్రకాష్ రాజ్ ఏకంగా తన ప్యానెల్ సభ్యుల లిస్టును కూడా ప్రకటించాడు. ఇక మా ఎన్నికల రేసులో ఈయనతో పాటు మంచు విష్ణు, హేమ, జీవిత, సివిఎల్ నరసింహరావు వంటి ప్రముఖ సీనియర్ నటీ, నటులు పోటీకి సై అంటున్నారు. మొదట్లో ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో పాల్గొంటున్నాడు అని ఓ వార్త రాగానే.. వెంటనే నాన్ లోకల్ అనే అంశం ప్రస్తావనకు వచ్చింది. అయినా సరే ఆయనకు కొందరు టాలీవుడ్ నటులు మద్దతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
గత మూవీ ఆర్టిస్ట్ అయేసోసిషన్ ఎన్నికలను పోల్చి చూస్తే గనుక ఎన్నడూ లేని విధంగా ఈ సారి పోటీ రసవత్తరంగ ఉండబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇక మరో విషయం ఏంటంటే..అందరిని కాకుండా ఈ సారి మా ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతుందన్న వార్తలు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా ప్రముఖ సీనియర్ నటి జయసుధను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. దీనికి సంబంధించి తేర వెనుక కొందరు సినీ పెద్దలు మంతనాలు కూడా జరుపుతున్నారట.
ఇక రెండు మూడు రోజుల క్రితం ఇదే విషయంపై హీరో మంచు విష్ణు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ మా ఎన్నికలు గనుక ఏకగ్రీవంగా జరిగితే అసలు పోటీ నుంచే తప్పుకుంటానంటూ తేల్చి చెప్పారు. నాకు అవకాశం ఇస్తే మాత్రం మా అసోసియేషన్ భవనాన్ని తన సొంత ఖర్చులతో నిర్మించి, ఆర్టిస్టులకు అండగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు. ఇక అందరు భావిస్తున్నట్లే మా ఎన్నికలను ఓటింగ్ పద్దతిలో ఎన్నుకుంటారా లేక ఏకగ్రీవంగానే ఎన్నుకోబోతున్నారా అనే ఈ రెండు ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.