అతి తక్కువ కాలంలో బుల్లితెరపై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. ఈయన జబర్థస్త్ కామెడీ షోతో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆది అంటే పంచులు, పంచులంటే ఆది అన్నట్లుగా మారిపోయారు. కేవలం బుల్లితెరపైనే కాదు.. సినిమాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీ గడుపుతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సార్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమా టీం మొత్తం పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైపర్ ఆది చిత్ర నిర్మాత నాగవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆది మాట్లాడుతూ.. ‘‘ నాగవంశీ పైకి ప్రొడ్యూసర్‌లాగా కనిపిస్తారు కానీ, ఆయనలో కూడా ఓ హీరో ఉన్నారు. ఆయన లోపల అర్జున్ రెడ్డి అంత యాటిట్యూడ్ ఉంటుంది. అల్లు అర్జున్ గారంత యాక్టివ్నెస్ ఉంటుంది. త్రివిక్రమ్ గారితో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి.. కొంచెం టైమింగ్, రైమింగ్ కూడా ఉంటుంది. వీటన్నిటి మధ్యలో ఆయన ఏదైనా జెన్యూన్‌గా అనిపించి ఒక మాట అంటే దాన్ని ఇంకోలా రాస్తున్నారు. ఆయన జెన్యూన్‌గా మాట్లాడతారు. స్ట్రైట్ పార్వర్డ్. భీమ్లానాయక్ సాంగ్ నాలుగు రోజులు షూట్ చేశా. ఓ రోజు ఆయనకు ఫోన్ చేశా.
‘సార్ ఒక ఆఫ్ డే కావాలి సార్.. ఢీ షూటింగ్‌కు అడుగుతున్నారు’ అని. దానికి ఎవరైనా అయితే, కుదరదు అని చెప్పేవారు. కానీ, నాగవంశీగారు ‘ఢీ కావాలో.. పవన్ కావాలో తేల్చుకో’ అన్నాడు. నేను రెండు చేతులు జేబిలో పెట్టుకుని భీమ్లానాయక్ షూటింగ్‌కు వెళ్లిపోయా. ఆయన అంత స్ట్రైట్ పార్వర్డ్’’ అని చెప్పుకొచ్చారు. కాగా, సార్ సినిమాలో ధనుష్, సంయుక్త హీరో,హీరోయిన్లుగా చేస్తున్నారు. ధనుష్ మిత్రుడిగా హైపర్ ఆది నటించారు. ఇక, ఆది సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తనకు లైఫ్ ఇచ్చిన బుల్లితెరను మాత్రం విడవటం లేదు. జబర్థస్త్‌తో పాటు మరికొన్ని షోలు చేస్తున్నారు. మరి, ఆది వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.