నువ్వే కావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను వంటి సినిమాలతో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో తరుణ్. గతంలో అమ్మాయిల కలల రాజకుమారుడిగా వెలిగిన తరుణ్ కొన్నేళ్ల నుంచి సినిమాల్లో కనిపించడం లేదు. ఆయన చివరి సారిగా నటించిన చిత్రం.. ఇది నా లవ్ స్టోరీ. ఈ సినిమా కూడా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో అప్పటి నుంచి తరుణ్ సినిమాల్లో కనిపించడమే మానేశాడు. అయితే ఈ లవర్ బాయ్ గురించి ఫిల్మ్ నగర్ లో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. కాగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ఖలేజా, అతడు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. మరోసారి వీరి కాంబినేషన్ ఓ సినిమా రానుండడంతో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఇదే సినిమాలో తరుణ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించనున్నాడని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై హీరో తరుణ్ స్పందించినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సినిమాలో నటించేందుకు నన్ను ఎవరూ సంప్రదించలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లనేనని తరుణ్ కొట్టిపారేశాడు. తరుణ్ ఇచ్చిన క్లారిటీతో ఈ వార్తకు ఫుల్ స్టాప్ పడ్డట్లు అయింది.