సావిత్రి.. ఇది కేవలం ఓ మనిషి పేరు మాత్రమే కాదు.. తెలుగు వెండి తెరలో ఓ శతాబ్ధపు చరిత్ర. తారల జీవితాల్లోని విషాదానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. అది సావిత్రి పేరు లేకుండా మొదలు కాదు. పురుషాధిక్యం మెండుగా ఉన్న మొదటి రోజుల్లో.. హీరోలకు ధీటుగా ఆమె స్టార్‌డమ్‌ను సంపాదించారు. హీరోలు కూడా తమ సినిమాలో సావిత్రి ఉండాలని పట్టుబట్టేవారు. ఆమె క్యాల్షీట్లు దొరక్కపోతే.. సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్న స్టార్ హీరోలు కూడా ఉన్నారు. కడు పేదరికం నుంచి వచ్చిన ఆమె వెండి తెరపై నటిగా అద్భుతాలను సృష్టించింది. కోటాను కోట్ల రూపాయల ఆస్తులని సంపాదించింది. హైదరాబాద్, చెన్నై, విజయవాడల్లో ఆమెకు ఉన్న ఆస్తుల్ని ఇప్పటి లెక్కప్రకారం లెక్కగడితే వేల కోట్లు ఉంటుంది.
అయితే, ఇంద్ర భవనాలను తలదన్నే ఇళ్లులు, విలాసవంతమై కార్లు ఇవేవీ ఆమెకు మనస్సాంతినివ్వలేదు. ఆమె అతి మంచి తనమే ఆమెను దారుణంగా దెబ్బతీసింది. కట్టుకున్న వాడు, బంధువులు, స్నేహితులు అందరూ ఆమెను మోసం చేశారు. దీంతో ఆన్నీ కోల్పోయింది. ఆస్తులు ఉన్నా అవసరానికి ఉపయోగపడలేదు. సావిత్రి నా సినిమాలో ఉంటే చాలు అనుకున్న రోజులు పోయాయి. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయాయి. పొట్ట నింపుకోవటం కోసం చిన్న చిన్న పాత్రలు చేయటం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే ఎన్నో అవమానాలకు గురైంది. చివరి రోజుల్లో ప్రొడక్షన్ బాయ్స్ కూడా ఆమెను సరిగా పట్టించుకోలేదన్నదు. చివరి రోజుల్లో ఆమె పడ్డ కష్టాలను స్వయంగా చూసిన నటుడు గుమ్మడి ఎంతో ఆవేదన చెందారు. మరణానికి ముందు రోజుల్లో సావిత్రి పడ్డ కష్టాలను స్వయంగా గమ్మడే ప్రపంచానికి వెల్లడించారు.
గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ నేను సావిత్రికి చాలా ఆత్మీయుడ్ని. నన్ను అన్న అని పిలిచేది. సావిత్రి ఉచ్ఛదశ తర్వాత ఆమె పడ్డ ఇబ్బందులన్నీ స్వయంగా చూశాను. ఇందులో ఓ చేదు గుర్తు, తీపి గుర్తు రెండూ ఉన్నాయి. నాకు ఓ వారం రోజులు ఆరోగ్యం బాగోలేదు. అవి సావిత్రి లాస్ట్ డేస్. ఆమె నన్ను చూడటానికి ఇంటికి వచ్చింది. డాక్టర్ నాకు ఇంజెక్షన్ ఇస్తే మగతగా పడుకుని ఉన్నా. సావిత్రి వచ్చి నన్ను పలకరించింది. ఎట్లా ఉన్నావ్ అన్నయ్యా అంది.. బాగా ఉన్నాను అన్నాను. తర్వాత నా తలగడ సర్ధివెళ్లిపోయినట్లు నాకు అనిపించింది. ఏంటా అని దాన్ని తీసి చూస్తే దాని కింద రెండు వేల రూపాయలు ఉన్నాయి. నేను ఫోన్ చేసి ఏంటి అని అడిగా.. ‘‘ మీరు మర్చిపోయారేమో అన్నయ్యా.. నేను మీ దగ్గర అప్పుడు 2 వేల రూపాయలు తీసుకున్నా..
పోయే లోపల ఎవ్వరికీ దమ్మడి కూడా బాకీ ఉండకూడదు. నాకు నిన్నే ఎవరో 5 వేలు అడ్వాన్స్ ఇచ్చారు. దాంట్లోంచి ఇస్తున్నా’’ అంది. నా కళ్లు చెమ్మగిల్లాయి. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత.. సినిమాలు కూడా తగ్గిపోయాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేయసాగింది. ఓ సారి ఓ సినిమాలో తల్లి పాత్రకు ఆమెను తీసుకున్నారు. నేను కూడా సినిమాలో చేస్తున్నాను. అందరికీ ఇంటి దగ్గరినుంచి భోజనాలు వస్తాయి. మాకు కొందరికి క్యారియర్లు వచ్చాయి. నేను భోజనం చేస్తున్నాను. ఆమె ఒక్కత్తే విడిగా కూర్చుని ఉంది. సాధారణంగా ఇంటినుంచి క్యారియర్ రాని వాళ్లకు ప్రొడక్షన్ వాళ్లు భోజనం అరెంజ్ చేయాలి. అప్పటికి ఆమెకు ఇంటినుంచి క్యారియర్ వచ్చే స్థితిలో కూడా లేదు. అంటే తెచ్చేవాళ్లు లేరు.
సావిత్రి నా దగ్గరకి వస్తే ‘ ఏమ్మా భోజనం చేయలేదా’ అని అడిగా. ‘లేదన్నయ్యా నాకు ఆకలిగా లేదు’ అంది. నాకు అర్థం అయిపోయింది. ప్రొడక్షన్ వాళ్లు భోజనం పెట్టలేదు. ఈమెకు ఇంటి దగ్గరినుంచి రాలేదు. ‘‘రామ్మా.. భోజనం చేద్దాం’ అన్నా. ‘‘వద్దు’’ అని అంది. ‘‘లేదమ్మా! నువ్వు వస్తే తప్ప నేను కూడా భోజనం చేయను’’ అన్నాను. అప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి భోజనం చేసింది’’ అని అన్నారు. సావిత్రి పడ్డ కష్టాల్లో ఇది కేవలం మచ్చు తునక మాత్రమే. ప్రపంచానికి తెలియని విషాదాలు ఆమె జీవితంలో ఎన్నో ఉన్నాయి.