ఒక వ్యక్తి చనిపోవడం అంటే ఒక కుటుంబం రోడ్డున పడడం. అతని మీద ఆధారపడి బతికిన వాళ్ళు ఒక్కసారిగా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోతే ఆ బాధను ఎవరూ చెప్పలేరు. కానీ బాధను పోగొట్టడానికి కొంత సహాయం చేస్తే మంచిది. రాకేష్ మాస్టర్ మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆయన కుటుంబానికి అండగా ఉంటామని గణేష్ మాస్టర్ హామీ ఇచ్చారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అశ్రునయనాల మధ్య కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అంతిమయాత్ర ముగిసింది. సోమవారం కుటుంబ సభ్యులు, శిష్యులు, అభిమానుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ లోని బోరబండ శ్మశానవాటికలో రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు ముగిశాయి. రాకేష్ మాస్టర్, జానీ మాస్టర్లు ఇద్దరూ రాకేష్ మాస్టర్ పాడె మోశారు. రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ తండ్రి చివరి కర్మలను పూర్తి చేశారు. రాకేష్ మాస్టర్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని డాన్స్ మాస్టర్లు అంటున్నారు. ఇదిలా ఉంటే రాకేష్ మాస్టర్ మృతితో ఆయన కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీంతో ఆయన శిష్యులంతా కలిసి కుటుంబానికి అండగా నిలబడాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.
రాకేష్ మాస్టర్ కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై గణేష్ మాస్టర్ స్పందించారు. ఖచ్చితంగా ఆయన కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. తెలుగు డాన్స్ ఇండస్ట్రీకి, మాకు పెద్ద దిక్కు రాకేష్ మాస్టరే అని, ఎక్కడున్నా ఎవరికీ ఏ సమస్య వచ్చినా సహాయం చేసేవారని, కరోనా సమయంలో కూడా సహాయం చేశారని గణేష్ మాస్టర్ అన్నారు. మాకెప్పుడూ గురువే అని, అందరికీ ఆయన గురువు అని.. మేము ఆయనతో కలిసి పని చేసినా, చేయకపోయినా డాన్స్ పరంగా ఆయనను గురువుగా ఆరాధిస్తామని అన్నారు. డాన్స్ నేర్పించి శిష్యులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.
ఆయన ఇలా వదిలేసి వెళ్ళిపోతారని అనుకోలేదని భావోద్వేగానికి గురయ్యారు. రాకేష్ మాస్టర్ శిష్యులందరూ ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి అందరం కలిసి ఆయన కుటుంబానికి అండగా నిలబడతామని అన్నారు. డాన్స్ మాస్టర్లు అందరం కలిసి ఒకసారి మాట్లాడుకుని ఆర్థికంగా అండగా నిలబడతామని అన్నారు. రాకేష్ మాస్టర్ పిల్లల బాధ్యత కూడా చూసుకుంటామని అన్నారు. బయట వారికే ఎన్నో చేస్తాము, అలాంటిది మా గురువు గారి కుటుంబానికి చేయకుండా ఎలా ఉంటామని అన్నారు. డాన్స్ మాస్టర్లు, యూనియన్ కలిసి నిర్ణయం తీసుకుంటామని, తప్పకుండా ఆ కుటుంబానికి సహాయం చేస్తామని అన్నారు.