ముఖానికి రంగు వేసుకుని వెండితెరపై వెలిగిపోవడం ఆశామాషీ విషయమేమీ కాదు. దానికి ఎన్నో ఏళ్ల కష్టం, కన్నీటి వ్యథలు దాటుకుని రావాలి. అలా వచ్చినా గానీ అతడు సక్సెస్ అవుతాడని గ్యారంటీ లేని ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. మరి అలాంటి ఇండస్ట్రీకి వచ్చి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమంలో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకోవడం మామూలు విషయం కాదు. ఇలాంటి పోరాట యోధులు పరిశ్రమంలో చాలా కొద్ది మందే ఉంటారు. అందులో అగ్రస్థానంలో నిలిచేది మెగాస్టార్ చిరంజీవి అయితే.. ఆ తర్వాత మళ్లీ అంతటి స్టార్ ఇమేజ్ ను సోలోగా క్రియేట్ చేసుకున్న ఘనత మాత్రం మాస్ మహారాజ ”రవితేజ”ది అనే చెప్పాలి. నట వారసులుగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎందరో హీరోలు.. పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో, సినీ పరిశ్రమ అనే కురుక్షేత్రంలోకి అభిమన్యూడిలా దూసుకొచ్చాడు రవితేజ.
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన మాస్ మహారాజ రవితేజ ఈ రోజు ఓ అగ్రహీరోగా వెలుగొందుతున్నాడు. మరి ఇంతటి కీర్తి ప్రతిష్టలు ఒక్క రోజులోనో, ఒక్క సంవత్సరంలోనో వచ్చినవి కాదు. రాత్రీ పగలు కష్టపడి కడుపు మాడ్చుకుని, కన్నీరు కారిస్తే తప్ప. ఇలాగే మాస్ మహారాజ రవితేజ కూడా జీవితంలో పడాల్సిన కష్టాలు అన్నీ పడ్డాడు.. చూడాల్సిన ఎత్తుపల్లాలు అన్నీ చూశాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తూ వస్తున్నాడు. రవితేజ మాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఒక్కటంటే ఒక్కటి కరెక్ట్ సినిమా రాలేదనే చెప్పాలి. రవితేజ నటించిన, ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమా అభిమానులను అలరించలేకపోయింది. ఇక తాజాగా వచ్చిన ధమాకా సైతం కలెక్షన్లలో పర్వాలేదనిపిస్తున్నా.. అభిమానులను మాత్రం మెప్పించలేకపోయింది. తాజాగా ధమాకా మూవీ చూశాక ఓ అభిమాని రవితేజకు ఓపెన్ లెటర్ రాశాడు. ప్రస్తుతం ఆ లెటర్ నెట్టింట వైరల్ గా మారింది.
”రవితేజ సర్.. మీరు మారాల్సిన సమయం వచ్చింది అనుకుంటా. నన్ను మారమని చెప్పడానికి నువ్వెవడ్రా అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు మారాలి అని చెప్పే హక్కు ఓ వీరాభిమానిగా నాకుంది. అవును మాకు ఒకప్పటి ‘ఇడియట్’ రవితేజ కావాలి.. అందుకోసమైనా మీరు మారాలి. సర్ మీరు సినిమాలు తీసుకుంటూ పోతున్నారే గానీ ఒక్కసారైనా వెనక్కితిరిగి చూసుకుంటున్నారా? కొత్త కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తున్నారు. ఈ విషయంలో నేను మీ అభిమానిగా ఎంతో సంతోషిస్తున్నాను.. కానీ సాయం పేరుతో నీకు నువ్వే చేసుకుంటున్న గాయం కనిపించడంలేదా? మెగాస్టార్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్రహీరోలను కాదని నీకు అభిమానిగా ఎందుకు మారానో తెలుసా? ఏ ఆధారమూ లేకుండా టాలీవుడ్ అనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నీ మెుక్కవోని ధైర్యాన్ని చూసి.
ఇంకో విషయం సర్.. చెప్పడానికి బాధగా ఉన్నప్పటికీ.. నిజాలు ఎప్పటికీ మారవు.. సో నిజాల్ని ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు చేసిన సినిమా పేర్లే గుర్తుండట్లేదు సర్. ఒక అభిమానిగా ఈ మాట చెప్తుంటే టన్నుల కొద్ది బరువు మోస్తున్నట్లుంది. మీరు మరోసారి మా చేత ‘ఇడియట్’ అని తిట్టించుకుంటే చూడాలని ఉంది సార్. వరల్డ్ కప్ లో దేశం ఓడిపోతే ఎంత బాధపడతామో.. ఓ అభిమానిగా మీ సినిమా ఆడకపోతే అంతకంటే ఎక్కువ బాధపడతాం. మీ సినిమాలను జడ్జ్ చేసేంత స్థాయి నాకు లేదు సర్, కానీ ఓ అభిమానిగా మిమ్మల్ని అగ్రస్థానంలో చూడాలన్న స్వార్థం తప్పితే. మాస్ మహారాజాగా మీరు ఎదిగిన క్రమమే ఓ చరిత్ర.. చరిత్ర ఎప్పటికీ ఆదర్శమే.. ఇక చాలా వేదికలపై మీ గురించి స్టార్ హీరోలందరు గొప్పగా చెబుతుంటే నా రోమాలు నిక్కబొడుచుకునేవి.
ఇక కాలం మారుతున్న కొద్ది కథల ఎంపికలో.. హీరోల ఆలోచనలు మారుతున్నాయి. కానీ మీరెందుకు ఇంకా ఆ పాత చింతకాయపచ్చడి లాంటి స్టోరీలనే ఎంచుకుంటున్నారు? ఒక్కసారి ఆగి మీరు గతంలో చేసిన సినిమాలను గుర్తుకు తెచ్చుకోండి సార్. ఓ ఇడియట్, భద్ర, విక్రమార్కుడు లాంటి సినిమాలు ఇచ్చిన మీరు.. ఇప్పుడు చేస్తున్న మూవీస్ చూస్తుంటే ఓ ఫ్యాన్ గా ముద్ద గొంతు దిగట్లే సర్. ఇక మెున్న రిలీజ్ అయిన ధమాకా సినిమా చూశాక, మీరు మారాల్సిన సమయం వచ్చింది అని అర్ధం అయ్యింది. ‘మాస్ మహారాజ’ లాంటి బిరుదు పెట్టుకుని ఇలాంటి సినిమాలు చేస్తున్నాడేంటి అని చాలా కోపం వచ్చింది సర్. కానీ ఓ భక్తుడు దేవుణ్ణి తిట్టడం ఎంత తప్పో.. ఓ అభిమాని హీరోను తిట్టడం కూడా అంతే తప్పు అని ఊరుకున్నాను. చివరిగా ఒక్కమాట సర్.. “మీరు మారాల్సిన సమయం వచ్చింది”
ఇట్లు నీ అభిమాని