అనసూయ భరద్వాజ్.. అటు బుల్లితెర ఇటు వెండితెర రెండింట తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. యాంకర్ గా పాపులర్ అయిన ఈ భామ తర్వాత నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుంకుంది. రంగస్థలంలో రంగమ్మత్తగా అమాయకంగా నటించిన అనసూయ.. పుష్పలో ఫుల్ నెగటివ్ క్యారెక్టర్ చేసింది. పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం పుష్ప-2 సినిమా సహా.. కృష్ణ వంశీ రంగమార్తాండ, మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి వరుస ప్రాజెక్టులతో ఫుల్ జిబీగా ఉంటోంది.
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి త్వరలోనే గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకాన్ని ఓ వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ వెబ్ సిరీస్ లో అనసూయకు ఓ అద్భుతమైన పాత్ర దక్కింది అనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కన్యాశుల్కం నాటకంలోనే ఎంతో కీలకమైన మధురవాణి(వేశ్య) పాత్ర కోసం యాంకర్ అనసూయను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో కన్యాశుల్కం సినిమా తెరకెక్కించగా.. అందులో ఎన్టీఆర్ గిరీశం పాత్రలో నటించగా.. మధురవాణి పాత్రలో మహానటి సావిత్రి నటించింది.
నిజానికి కన్యాశుల్కం నాటకం మొత్తం ఆధారపడి ఉన్నది.. మలుపులు తిరిగింది కేవలం మధురవాణి పాత్రతోనే. ఆ పాత్రలో ఎన్నో వేరియేషన్స్, మరెన్నో షేడ్స్ ఉంటాయి. వేశ్యగా పడుపు వృత్తి చేస్తూనే మానవ సంబంధాలు, భార్యభర్తల అనుబంధం గురించి అర్థమయ్యేలా చెబుతుంది. నాటకం మొత్తంలో ఎంతో అద్భుతమైన, కీలకమైన పాత్ర మధురవాణిదే. అంతటి ఐకానిక్ పాత్ర కాబట్టే అనసూయ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి అలాంటి పాత్రను ఒప్పుకోవాలి, నటించాలంటే చాలా ధైర్యం కావాలి. నటనలో ఎంతో పట్టు, హావభావాలను పలికించగల నేర్పు ఉండాలి. గతంలో మహానటి సావిత్రి నటించిన పాత్ర అంటే ప్రేక్షకులకు మినిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి.
ఆ పాత్రకు అనసూయ న్యాయం చేయగలది డైరెక్టర్ క్రిష్ నమ్మడంలో అస్సలు తప్పు లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అందం, అభినయం, అమాయకత్వం, ఆహార్యం వీటన్నింటిలో అనసూయకు ఎవరైనా వందకు వంద మార్కులు వేయాల్సిందేనని.. మధురవాణి పాత్ర కోసం అనసూయ పేరు చెప్పాక మరొకరి పేరు కూడా ఊహించుకోలేరంటూ ఆమె ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే కన్యాశుల్కం వెబ్ సిరీస్, అనసూయ పాత్రపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు దీనిలో నిజానిజాలు ఏంటనేవి చెప్పలేని పరిస్థితి. వేశ్య పాత్రలో అనసూయ నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.