తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఆ క్రేజ్ మరో రేంజ్‌కు చేరుకుంది. ఆ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది. పవన్ కల్యాణ్ 28వ సినిమా(PSPK 28) హరీశ్ శంకర్ దర్శకుడన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. అతి త్వరలో సెట్స్ పైకి రానున్నట్లు నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు ప్రకటించారు. సెప్టెంబర్ 2న ‘దిస్ టైమ్ నాట్ జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్’ అని హరీశ్ శంకర్ విడుదల చేసిన పోస్టర్ అభిమానుల్లో మరింత ఉత్సుకతని పెచింది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘భీమ్లానాయక్’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాలు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకోనున్నాయి. ‘భీమ్లా నాయక్’ త్వరగా పూర్తి కానుందని, ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ప్రారంభమైన వెంటనే పవన్-హరీశ్ శంకర్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలిపింది. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయాంక్ బోస్ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్టర్‌గా ఆనంద సాయి, ఎడిటర్‌గా చోటా కెప్రసాద్, ఫైట్ మాస్టర్లుగా రామ్-లక్ష్మణ్ వ్యవహరిస్తారని నిర్మాతలు తెలిపారు. ఇక, క్రేజీ కాంబో ఎప్పుడు తెరమీదకు వస్తుందా అని పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మళ్లీ గబ్బర్‌సింగ్‌లాంటి హిట్ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.