కమెడియన్ రఘుకు హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ప్రేమో తెలిసిందే. ఈ విషయాన్ని రఘు ఎన్నోసార్లు బయటపెట్టాడు. అలాంటి రఘు.. తారక్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని అన్నాడు. ఎన్టీఆర్ కోసం చావడానికైనా రెడీ అని చెప్పాడు.
టాలీవుడ్లో కమెడియన్లకు ఢోకా లేదు. ఒకప్పుడైతే కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేది తెలుగు చిత్రపరిశ్రమ. బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ, సునీల్, అలీ, వేణుమాధవ్ లాంటి ఎందరో కమెడియన్లు తమ హాస్య ప్రతిభతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. ఇప్పుడు కూడా కొత్తతరం కమెడియన్స్ పుట్టుకొస్తున్నారు. ఇదిలాఉంటే.. కమెడియన్ రఘు కారుమంచి గుర్తుండే ఉంటాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు చాలా ఫేమస్. 200కి పైగా సినిమాల్లో ఆయన నటించాడు. ‘ఆది’, ‘అదుర్స్’ లాంటి మూవీస్‌లో తనదైన మేనరిజమ్స్‌తో ఆకట్టుకున్నాడు రఘు. అలాంటి రఘు ఇటీవల తన లైఫ్, కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తాను ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడ్నని చెప్పాడు.
వృత్తి సాఫ్ట్వేర్ అయినా ప్రవృత్తి మాత్రం సెటిల్మెంట్లు, దందాలు అని స్వయంగా రఘునే వెల్లడించాడు. కాలేజీ రోజుల నుంచి రౌడీయిజం చేసేవాడ్నని చెప్పిన రఘు.. తన స్నేహితుడైన జూనియర్ ఎన్టీఆర్ జోలికి ఎవరైనా వస్తే చంపడానికైనా, చావడానికైనా రెడీ అన్నాడు. ‘ఎన్టీఆర్ కోసం ప్రాణాలు ఇవ్వడమే కాదు.. తీయమన్నా తీసేస్తా. ఫలానా వ్యక్తి ఇలా అన్నాడని చెప్తే.. రేపటికల్లా ఆ ప్రాణం మిగలదు.. తీసేస్తా. దీంట్లో ఎలాంటి మొహమాటం లేదు. నేను పక్కా హైదరాబాదీ. ఎన్టీఆర్ జోలికి ఎవరు వచ్చినా ప్రాణం తీసేస్తా. నాకు అంత ఇష్టం ఆయనంటే. ఎన్టీఆర్ నా బాడీలో ఒక పార్ట్‌లా మారిపోయారు’ అని రఘు పేర్కొన్నాడు. భవిష్యత్తులో ఎన్టీఆర్ పక్కా సీఎం అవుతారని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడు అవుతారనేది చెప్పలేం.. కానీ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ముఖ్యమంత్రి అవ్వడం పక్కా అని రఘు స్పష్టం చేశారు.