Gangavva: యూట్యూబర్ గంగవ్వ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గంగవ్వ అంటే తెలుగు రాష్ట్రాలలో ఎంతోమందికి స్ఫూర్తి. చదువుతో సంబంధం లేని గంగవ్వ సెలబ్రిటీ స్థాయికి ఎదగడం ఎవరూ ఊహించనిది. మొదటగా యూట్యూబ్ ద్వారానే గంగవ్వ సోషల్ మీడియా యూజర్లకు సుపరిచితం. ఆ తర్వాత యూట్యూబ్ లో ‘మై విలేజ్ షో’ పేరుతో వీడియోలు చేసిన గంగవ్వ మంచి ఫేమ్ సంపాదించుకొని ఏకంగా బిగ్ బాస్ షోలో అడుగుపెట్టింది.
బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న గంగవ్వ.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై మరింత దగ్గరైంది. అలాగే బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఆమెకు తగిన మద్దతు కూడా అందించారు ప్రేక్షకులు, అభిమానులు. అయితే.. అనారోగ్య కారణాల వలన గంగవ్వ మధ్యలోనే బయటికి వచ్చేసింది. అదికూడా గంగవ్వ కోరిక మేరకే ఆమెను బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పంపించారు.
గంగవ్వ బిగ్ బాస్ లో ఉన్నప్పుడే హోస్ట్ అక్కినేని నాగార్జున ఆమెకు కొత్త ఇల్లు కట్టిస్తానని.. ఇచ్చిన మాటను నెరవేర్చారు. ఏడాది క్రితం నూతన గృహప్రవేశం చేసింది గంగవ్వ. అలా సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంటూ బాగా పాపులారిటీ సొంతం చేసుకున్న గంగవ్వ.. ఇటీవల క్యారవాన్ లో దర్శనమిచ్చి సర్ప్రైజ్ చేసింది. షూటింగ్స్ లో తనకు క్యారవాన్ కూడా ఏర్పాటు చేస్తున్నారని స్వయంగా చెప్పుకొచ్చింది గంగవ్వ.
అలాగే తాజాగా ఓ వీడియోలో తన క్యారవాన్ అనుభవాన్ని కూడా తెలియజేసింది. అయితే.. ఆ క్యారవాన్ విరాట పర్వం ప్రమోషన్స్ కోసం నెట్ ఫ్లిక్స్ వారు ఏర్పాటు చేసినట్లు సదరు వీడియోలో తెలిపారు. ప్రస్తుతం గంగవ్వ క్యారవాన్ లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక కొందరు గంగవ్వ క్యారవాన్ మెయింటైన్ చేసే రేంజికి వెళ్లిందా అని షాక్ అవుతున్నారు. మరి గంగవ్వ క్యారవాన్ పై మీ అభిప్రాయాల కామెంట్స్ లో తెలియజేయండి.