సినిమా సినిమా నువ్వేం చేస్తావ్ అంటే.. విరిగిపోయిన మనసుల్ని కలుపుతాను, గడ్డకట్టిన హృదయాలను కరిగిస్తాను, వయసులో ఉన్నా కూడా వృద్ధుడిలా ఆలోచిస్తున్న మనసులో చైతన్యం తీసుకొస్తాను, మారుస్తాను, ఏమరుస్తాను అని అన్నాదట. తాజాగా బలగం సినిమా చేసిన పని చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది. ఈ సినిమా ఎంతగా ప్రభావితం చేసిందంటే నువ్వా, నేనా అని కొట్టుకు చచ్చే అన్నదమ్ములను నువ్వు లేకపోతే నేను లేను అనే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని తొలగించి ప్రేమను మొలకెత్తించింది.
చెడు సినిమాల వల్ల ఎంత ప్రభావం అయితే ఉందో.. సామాజిక సందేశంతో కూడిన చక్కని సినిమాల వల్ల కూడా ఆ ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. అప్పుడెప్పుడో శ్రీమంతుడు సినిమా చూసి దత్తత తీసుకోవాలని కొంతమంది ప్రముఖులు ముందుకొచ్చారు. ఆ తర్వాత మహర్షి సినిమా చూసి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వీకెండ్ ఫార్మింగ్ పేరుతో బయటకు రావడం ప్రారంభించారు. ఇలా పెద్ద పెద్ద హీరోల సినిమాలు చూసి అందులో సందేశం నచ్చి ప్రభావితమై సేవా కార్యక్రమాలు చేసే అభిమానులు అనేక మంది ఉన్నారు. తాజాగా బలగం సినిమా ఇద్దరు అన్నదమ్ములను కలిపింది. ఏళ్ల తరబడి మాట్లాడుకోని అన్నదమ్ములను మనసు విప్పి మాట్లాడుకునేలా చేసింది. అనుబంధం అంటే ఏంటో వదిలేసిన వారి మనస్సులో అనుబంధ విలువలను నాటింది ఈ సినిమా.
వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద గ్రామానికి చెందిన గుర్రం పోసులు, గుర్రం రవి అనే ఇద్దరు అన్నదమ్ములు కొన్నేళ్ల క్రితం స్థలం విషయంలో గొడవపడి విడిపోయారు. స్థలం విషయంలో వచ్చిన గొడవ కారణంగా ఏళ్ల తరబడి మాట్లాడుకోవడమే మానేశారు. అయితే ఇటీవల బలగం సినిమా విడుదలవ్వడంతో.. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్పి సర్పంచ్ నూరకంటి ముత్యంరెడ్డి తమ గ్రామంలో బలగం సినిమాని ఉచితంగా ప్రదర్శించారు. ఊరు ఊరంతా సినిమాని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమాని చూసి భావోద్వేగానికి గురైన వారిలో గుర్రం పోసులు, గుర్రం రవి కూడా ఉన్నారు. తమ మనసు మార్చుకుని ఆదివారం ఒకటయ్యారు ఇద్దరు.
తమ మధ్య ఉన్న స్థల వివాదాన్ని పరిష్కరించుకుని గ్రామ పెద్దల సమక్షంలో మరలా దగ్గరయ్యారు. బలగం సినిమా చూసి విడిపోయిన అన్నదమ్ములు మరలా ఒకటవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి సినిమాలే తీయాలని.. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి మంచి జరుగుతుందని.. హింస, పాశ్చాత్య పోకడలను అలవాటు చేసుకునే విధంగా సినిమాలు తీయకూడదని గ్రామస్తులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అన్నదమ్ములను కలిపిన బలగం సినిమాపై, బలగం సినిమా దర్శకుడు వేణుకి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇది కదా అసలైన గెలుపు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
భూమి తగాదాలతో విడిపోయిన అన్నదమ్ములు.
#బలగం సినిమా చూసి కలుసుకున్నారు
ఓ స్తలం విషయంలో గొడవపడ్డ అన్నదమ్ములు కొన్నేళ్లుగా విడిపోయారు. బలగం సినిమా చూడటంతో వాళ్లు మనసు మార్చుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకొని కలిసిపోయారు@VenuYeldandi9 @priyadarshi_i pic.twitter.com/1UWkjgpSCn— Akhil Patel (@Akhil4BJP) April 3, 2023