బంధాలు,బంధుత్వాలు, విలువలు వంటి వాటిపై చర్చించుకునేలా చేసిన సినిమా బలగం. ఓటీటీలో వచ్చేసినప్పటికీ.. ఈ సినిమాను థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో కీలక పాత్రధారి కొమరయ్య చెల్లెలు పోచవ్వగా నటించిన విజయలక్ష్మి.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా బలగం సినిమా గురించి చర్చ వస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఆలోచింపజేసింది. ప్రజాకోణాన్ని మార్చింది. బంధాలు,బంధుత్వాలు, విలువలు వంటి వాటిపై చర్చించుకునేలా చేసింది. ఆ సినిమా గ్రామీణంలోనే కాదూ పట్టణ కుటుంబ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసినా.. థియేటర్‌కి వెళ్లి ఈ సినిమా చూస్తున్నారంటే..ఎంతగా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారో అర్థం అవుతుంది. మొత్తం తెలంగాణ నటీనటులతోనే రూపొందించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో నటించిన అనేక మందికి పేరు రావడమే కాదూ.. మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి.
ఈ సినిమాలో కీలక పాత్రధారి, సినిమాకు టర్నింగ్ పాయింట్ అయిన విజయలక్ష్మి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె సురభి కళాకారిణి . ఈ సినిమాలో పోచవ్వగా ఆమె మెప్పించిన తీరు ఫిదా అవ్వాల్సిందే. కొమరయ్య చెల్లెలుగా, ఆ కుటుంబానికి మేనత్తగా నటించిన విజయలక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను పంచుకున్నారు. తాను సురభి కళాకారిణి అని, నాటకాలు వేస్తున్నానని, 35 ఏళ్ల పాటు హరికథలు చెప్పానన్నారు. నంది సహా ఎన్నో అవార్డులు వచ్చాయన్నారు. ‘నేను చేసిన తొలి చిత్రం బలగం. ఇది యదార్థంగా జరుగుతున్న కథ. నాకు ఈరోజు ఇంతమంచి పేరు రావడానికి కారణం దర్శకుడు వేణు’నే అన్నారు.
ఈ సినిమా సహజంగా రావడానికి ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారని అన్నారు. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డామని తెలిపారు. ‘నా భర్త చనిపోయాక నా పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు కొడుకులు ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారు. నా చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ సమయంలో అతడి భార్య గర్భవతి. నా జీవితంలో తట్టుకోలేని విషాదమది. అన్ని విధాలుగా తోడుండే భర్త చనిపోవడం, ఆయన మరణించిన నాలుగేళ్లకు కుమారుడు చనిపోవడంతో చాలా బాధలో కూరుకుపోయాను. ఆ సంఘటన నుంచి నేనింతవరకు తేరుకోలేకపోతున్నాను’ అంటూ పోచవ్వ భావోద్వేగానికి గురయ్యారు.