మనిషి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అవకాశాలు వస్తున్న సమయంలో నమ్మిన మనుషులే నట్టేట ముంచుతారు. అవకాశాలు రాకుండా అడ్డుపడుతుంటారు. ఇలాంటివి సినిమా పరిశ్రమలో ఎక్కువగా జరుగుతుంటాయి. నమ్మినవాళ్ళే మోసం చేస్తారు. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా వెన్నుపోటుకు గురైందని వెల్లడించింది.
మహేష్ తో అతిథి సినిమాలో నటించిన అమృత రావు తెలిసే ఉంటుంది. బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న రోజులవి. మహేష్ బాబుతో అతిథి సినిమా షూటింగ్ చేస్తుంది. ఆ సమయంలో అనుకోని సంఘటన వల్ల చాలా నష్టపోయానని అమృత రావు వెల్లడించింది. మహేష్ బాబు పోకిరి ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తమిళ, హిందీ, కన్నడ వంటి భాషల్లో రీమేక్ చేశారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభు దేవా రీమేక్ చేశారు. సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే కాకుండా.. బాలీవుడ్ లో బడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాంటి సినిమాలో అమృత రావుకి అవకాశం వస్తే తన వరకూ రానివ్వకుండా మేనేజర్ అడ్డుపడ్డాడని ఆమె వెల్లడించింది.
కపుల్ ఆఫ్ థింగ్స్ అనే పుస్తకాన్ని గత నెలలో విడుదల చేశారు. బాలీవుడ్ జంట రన్వీర్ సింగ్, దీపికా పదుకొనె ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో అమృత తన జీవితంలో ఎదురైన సంఘటనలను ఈ పుస్తకంలో రాసుకొచ్చింది. ఈ క్రమంలో ఆమె తన జీవితంలో ఎదురైన ఒక చేదు సంఘటనను పుస్తకంలో షేర్ చేసింది. సల్మాన్ ఖాన్ నటించిన వాంటెడ్ సినిమా ఆఫర్ ముందు తనకు వచ్చిందని, అయితే తన మేనేజర్ డేట్స్ ఖాళీ లేవంటూ పంపించేశాడని ఆమె వెల్లడించింది. ఈ విషయం తనకు తర్వాత తెలిసిందని ఆమె బాధపడింది. అప్పుడు హైదరాబాద్ లో మహేష్ బాబుతో అతిథి సినిమా షూటింగ్ చేస్తున్న రోజులు.
ఒకరోజు షూటింగ్ తర్వాత హోటల్ లోని లాబీలో కూర్చున్నానని.. ఆ సమయంలో నిర్మాత బోనీ కపూర్ నిర్మాణ సంస్థలో పని చేసే సిబ్బంది ఒకరు తన దగ్గరకు వచ్చారని ఆమె వెల్లడించింది. హాయ్ అమృత ఎలా ఉన్నావ్ అని పలకరించాడని.. నీ డేట్స్ సమస్య లేకపోయి ఉంటే ఈరోజు మాతో పాటు సల్మాన్ ఖాన్ వాంటెడ్ సినిమా షూటింగ్ లో ఉండేదానివంటూ అతను చెప్పినట్లు ఆమె పుస్తకంలో రాసుకొచ్చింది. ఆ మాట వినగానే తాను షాక్ అయ్యానని.. అతని వైపు ఆశ్చర్యంగా చూశానని.. నన్నెప్పుడు వాంటెడ్ సినిమా కోసం సంప్రదించారని అయోమయంగా అడిగానని ఆమె వెల్లడించింది. దానికి అతను నీ మేనేజర్ కి కాల్ చేస్తే డేట్స్ ఖాళీ లేవని చెప్పాడు అంటూ సమాధానమిచ్చాడు.
ఆ మాట వినగానే తన గుండె ముక్కలైందని.. ఈ సినిమా ఆఫర్ గురించి తన మేనేజర్ అస్సలు చెప్పలేదని ఆమె రాసుకొచ్చింది. మేనేజర్ గనుక చెప్పి ఉంటే ఏదో ఒకలా ఖచ్చితంగా డేట్స్ ఇచ్చేదాన్నని ఆమె పేర్కొంది. స్టార్ హీరో పక్కన నటించే అవకాశం.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ లో నటించే ఛాన్స్ కోల్పోయానని ఆమె ఏడ్చేసినట్లు ఆమె పేర్కొంది. తన దగ్గర ఉద్యోగం మానేస్తున్నా అని చెప్పలేక.. ఇలా చేశాడని ఆమె తెలిపింది. అయితే మేనేజర్ ను పని లోంచి తీసేశానని.. అతను తనపై పగ పెంచుకున్నాడని ఆమె వెల్లడించింది. మరి ఎంతగానో నమ్మిన మేనేజర్ ఆఫర్ పోగొట్టడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.