ప్రముఖ నటుడు అలీ పెద్ద కూతురు ఫాతిమా పెళ్లి త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలీ తన కూతురు పెళ్లికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం సతీ సమేతంగా తాడిపల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. తమ కూతురు పెళ్లికి రావాలంటూ సీఎం జగన్‌కు ప్రత్యేక ఆహ్వానం అందించారు. అనంతరం అలీ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో సహనం ఎంతో అవసరమని ఆయన అన్నారు. అది కోల్పోయి మాట్లాడితే జనమే తిరగబడతారని చెప్పారు. బూతులు తిట్టడమే రాజకీయం అనుకోవటం తప్పన్నారు. ఈ ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ 175 స్థానాలు గెలిచే క్రతువులో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. ప్రభుత్వ భాగస్వామిగా మరో అలీని చూస్తారని అన్నారు.
కాగా, అలీ 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. చాలా చోట్ల ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించారు. పార్టీ గెలిచిన తర్వాత కీలక పదవి వస్తుందని భావించారు. ఈ నేపథ్యంలోనే అలీ సేవలను గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వం.. తాజాగా అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించింది. ప్రభుత్వ సలహాదారు పదవి రావడంపై అలీ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కూతురి పెళ్లికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన బహుమతిగా ఈ పదవిని భావిస్తున్నట్లు వారు తెలిపారు.