అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా పరిశ్రమలోకి వచ్చిన వారిలో అఖిల్ ఒకరు. అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు.
అక్కినేని వంశ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అఖిల్. 2015లో వచ్చిన ‘అఖిల్’ సినిమాతో హీరోగా మారారు. ఇప్పటి వరకు ఆయన నటించిన ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ఎక్కువ శాతం ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. 2021లో వచ్చిన ‘‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’’ సినిమాతో అఖిల్ ఓ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించి ‘ఏజెంట్’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ రిలీజ్‌కు రెడీ అయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఏజెంట్’ ఈ నెల 28న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే అఖిల్ సినిమా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు.
తాజాగా, మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్కినేని వంశ వారసత్వంపై అఖిల్ సంచలన కామెంట్లు చేశారు. తాను అక్కినేని వారసుడిగా కాకుండా అఖిల్‌గా సినిమాలు చేస్తున్నానని అన్నారు. అక్కినేని వారసత్వం తనకు ఓ బరువుగా మారుతుందని కామెంట్ చేశారు. అఖిల్ మాట్లాడుతూ.. ‘‘ నేను అక్కినేని వారసుడిగా పనిచేయను.. అఖిల్‌గా పని చేస్తున్నాను. అక్కినేని వారసుడిగా పని చేయాల్సి వస్తే.. ఒకే రకంగా పని చేయాల్సి వస్తుంది. వారసత్వం ఇదంతా బర్డెన్‌గా ఉంటుంది. ఓ నటుడిగా నేను మెరుగుపడటానికి చూస్తున్నాను.
ఓ నటుడిగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఓన్ చేసుకుంటే అది నాకు హ్యాపీ. నేను దానికోసమే ప్రయత్నిస్తున్నాను. దాని కోసమే నా పోరాటం. నా కెరీర్ మొత్తం దాని కోసమే ఫైట్ చేస్తూ ఉంటాను. వారసత్వం గురించి ఎక్కువ ఆలోచిస్తే.. ఆ ట్రాక్‌లోకి వెళ్లిపోతా’’ అని అన్నారు. కాగా, ‘ఏజెంట్’ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. వక్కంతం వంశీ కథను అందించారు. ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అఖిల్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి, ఈ సినిమా ఎలాంటి విజయాల్ని సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.