టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కి ఛాన్సులు చాలా తక్కువ. ఒకవేళ వాళ్లు చేసినా సరే రెండో హీరోయిన్, సైడ్ క్యారెక్టర్సే ఎక్కువగా ఇస్తుంటారు. ఇది మనందరికీ తెలిసిన నగ్నసత్యం. దీన్ని ఎవరూ కాదనరు కూడా. ఈ విషయమై సందర్భం బట్టి పలువురు తెలుగు భామలు మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఓ తెలుగు నటి.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా అక్కడ దమ్ముండాలి అని అనేసింది. ఫేస్ బుక్ లో ఓ పెద్ద పోస్టు కూడా పెట్టింది. దీంతో ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కరోనా మన జీవితాల్లోకి ఎంటరైన తర్వాత సినిమాకు భాషాభేదం పోయింది. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చాలు.. మన ఆడియెన్స్ సినిమాల్ని తెగ ఆదరిస్తున్నారు. అలా ఆదరణ పొందిన తాజా చిత్రం ‘కాంతార’. అడవి బ్యాక్ డ్రాప్ లో ఉండే కన్నడ సంప్రదాయల ఆధారంగా ఈ సినిమా తీశారు. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం.. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. పలు సినిమాల పాత రికార్డ్స్ ని బద్దలు కొడుతోంది. ఈ క్రమంలోనే తెలుగు నటి రేఖా భోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మన దర్శకులు ఆ విషయం చూసి బుద్ధి తెచ్చుకోవాలని చురకలు అంటించింది.
”కేజీఎఫ్’, ‘కాంతార’ హీరోయిన్స్ శ్రీ నిధి శెట్టి, సప్తమి గౌడ. కన్నడ వాళ్లు కన్నడ అమ్మాయిలనే పెట్టుకుని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇది చూసి అయినా మన దర్శకులు కాస్త బుద్ధి తెచ్చుకోవాలి. ఇవి కాకుండా రంగితరంగ, ముంగారుమలై, దునియా, కిరాక్ పార్టీ ఇలా చాలా ఉన్నాయి. కార్తికేయ 2 లో ఆ మలయాళీ కాకుండా తెలుగు అమ్మాయి ఉన్నా ఆ మూవీ అలానే ఆడుతుంది. మన సబ్జెక్ట్ లో అండ్ మన Gలో దమ్ము (గుండెల్లో దమ్ము) ఉండాలే కానీ, ఆ నార్త్, మలయాళీ, కన్నడ అమ్మాయిలు వచ్చి ఇక్కడ చేసేది ఏం ఉండదు. డైలాగ్స్ చెప్పమంటే జీరో ఎక్స్ ప్రెషన్స్ తో అప్పడాలు, ఒడియాలు నమిలినా కూడా మనవాళ్ళకి వాళ్ళే కావాలి. మన తెలుగు సినిమాల దరిద్రం ఏంటంటే రాజ్ తరుణ్, కార్తికేయ, విష్వక్ సేన్ లాంటి వాళ్లు.. కిరణ్ అబ్బవరం, శ్రీ సింహ, సంతోష్ శోభన్, కళ్యాణ్ దేవ్ లాంటి వాళ్ల పక్కన కూడా మన తెలుగు అమ్మాయిలు లేరు’
‘అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలో వాళ్లు ఆ నేటివిటీకి తగినట్లు అదే లాంగ్వేజ్ అమ్మాయిలని తీసుకుంటారు. బట్ అదే సినిమాని మనవాళ్ళు రీమేక్ చేసినప్పుడు మాత్రం మన నేటివిటీకి తెలుగు అమ్మాయిలను కాకుండా వేరే వాళ్ళను పెడతారు. అక్కడ సైడ్ యాక్టర్స్ అయిన నారప్ప, మాస్టర్ మూవీల అమ్మాయిలను మనవాళ్ళు హీరోయిన్లుగా చేసేశారు. వాళ్లు వాళ్ళ లాంగ్వేజ్ లోనే హీరోయిన్స్ కాదు అసలు. చివరికి అందరూ అసలు సినిమాల కిందే లెక్కచేయని మా వైజాగ్ ఫిల్మ్స్ లో కూడా తెలుగు అమ్మాయిలకు స్థానం లేదు. ఇది మన తెలుగు సినిమాకి పట్టిన కర్మ, దరిద్రం’ అని రేఖా భోజ్ సుధీర్ఘంగా రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా తెలుగులో రంగీలా, దామిని విల్లా తదితర సినిమాల్లో ఈమె నటించింది. మరి రేఖ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.