ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు అనేవి సంతోషించే వార్తలుగా కాకుండా చర్చించుకునే అంశాలుగా మారిపోతున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరి పెళ్లిళ్లు, ఆ తర్వాత వివాహ బంధాలు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. భార్యాభర్తల మధ్య చిన్న క్లాష్ వస్తేనే విడాకుల వరకు వెళ్లిపోవడం, విడిపోయాక ఒకరికొకరు ఇగోలతో మొహాలు తిప్పేయడం జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో పదేళ్ల క్రితం విడిపోయిన మాజీ భర్తను.. అతని భార్య ఉండగానే ఇంటికెళ్లి కలిసి షాకిచ్చింది ఓ సెలబ్రిటీ. ఆమె ఎవరో కాదు.. తమిళ డాన్స్ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ భార్య కాజల్ పశుపతి. ప్రస్తుతం వీరి టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
శాండీ మాస్టర్ గురించి కోలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఎందుకంటే.. తెలుగులో ఎన్నో డాన్స్ రియాలిటీ షోలకు శాండీ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. 2009లో శాండీ – కాజల్ పశుపతిని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకోగానీ ఇద్దరి మధ్య విభేదాల కారణంగా ఈ జంట మూడేళ్ళకే(2012) విడాకులు తీసుకొని విడిపోయింది. ఆ తర్వాత ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తూ వస్తున్నారు. శాండీ మాస్టర్ కోలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా బిజీ అయిపోయాడు. అనంతరం.. 2017లో సిల్వియాను రెండో పెళ్లి చేసుకున్నాడు శాండీ. ప్రస్తుతం వీరికి ఓ కూతురు, ఓ కొడుకు ఉన్నారు. ఈ క్రమంలో శాండీ తన ఫ్యామిలీతో ఇంట్లో ఉన్న సమయంలో మాజీ భార్య కాజల్ వచ్చి షాక్ ఇచ్చిందట.
ఇంతకీ శాండీ మాజీ భార్య కాజల్.. ఇంటికి వచ్చి ఏం చేసింది? వారి రియాక్షన్ ఏంటి? అనంటే.. విడాకులు తీసుకున్న మాజీ భర్త శాండీని దాదాపు పదేళ్ల తర్వాత ఇంటికెళ్లి కలిసి మాట్లాడిందట కాజల్. శాండీతో పాటు అతని భార్య సిల్వియా, పిల్లలతో కూడా నవ్వుతూ ముచ్చటించిందట. అలాగే వారితో టైమ్ స్పెండ్ చేసి.. దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే.. ఇన్నేళ్ల తర్వాత శాండీ ఇంటికి ఎందుకు వెళ్లిందో తెలియలేదు. కానీ.. ఫోటోలు పోస్ట్ చేసి.. ‘శాండీ నువ్వు, నీ ఫ్యామిలీ బాగుండాలి’ అని క్యాప్షన్ జోడించింది. ఇక సోషల్ మీడియాలో చాలా గ్యాప్ తర్వాత శాండీ – కాజల్ ఒకే పిక్ లో కనిపించేసరికి ఫ్యాన్స్, నెటిజన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడీ శాండీ – కాజల్ వ్యవహారం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.