సాధారణంగా కొన్ని సినిమాలు హీరో ఫస్ట్ లుక్ నుండే అంచనాలు పెంచేస్తుంటాయి. పోస్టర్స్, లుక్స్ పరంగా మాస్ కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా జనాలను ఆకర్షిస్తుంటాయి. ఆ విధంగా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన సినిమా ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఊరమాస్ యాక్షన్ జానర్ లో తెరకెక్కుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో ఇండస్ట్రీని దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సలార్ సినిమాను రూపొందిస్తున్నాడు. కేజీఎఫ్ సిరీస్, కాంతార చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో సలార్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సలార్ మూవీ నుండి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియ మీనన్.. సలార్ అభిమానులకు అదిరిపోయే కబురు చెప్పింది. సలార్ మూవీలో పృథ్వీరాజ్ వరదరాజ మన్నార్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అతను కూడా ఈ సినిమాపట్ల ఎంతో ఆసక్తిని కనబరిచాడు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇలా వేరే సినిమాలలో కీలకపాత్రలు చేస్తున్నాడు. అయితే.. ఇటీవల పృథ్వీరాజ్ భార్య సుప్రియ మీనన్ సలార్ మూవీ షూటింగ్ సెట్స్ లోకి వెళ్లిందట. ఈ సందర్భంగా సుప్రియ మీనన్ సలార్ గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
సుప్రియ మీనన్ మాట్లాడుతూ.. “రీసెంట్ గా సలార్ మూవీ సెట్స్ కి వెళ్ళాను. దర్శకుడు ప్రశాంత్ నీల్, టీమ్ చాలా కష్టపడుతున్నారు. చూస్తుంటే.. సలార్ మూవీ ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. ఇలాంటి గొప్ప క్రియేటివిటీ కలిగిన సలార్ టీమ్ వర్కింగ్ స్టైల్ ని దగ్గరగా చూడటం ఆనందంగా ఉంది” అని ఆమె సోషల్ మీడియా పోస్ట్ లో రాసుకొచ్చింది. అలాగే ప్రశాంత్ నీల్ తో కలిసి దిగిన పిక్ కూడా షేర్ చేసింది. దీంతో సుప్రియ పోస్ట్ చూసి డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 23న రిలీజ్ కాబోతుంది. చూడాలి మరి సలార్ ఎలాంటి రికార్డులను తిరగరాయనుందో!