యాక్షన్ కింగ్ అర్జున్.. గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు నలభై ఏళ్లకు పైగా దక్షిణాది చిత్రసీమలో ఎనలేని స్టార్డమ్ సంపాదించుకున్నాడు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషలలో దాదాపు 160 సినిమాలకు పైగా నటించాడు. కర్ణాటకలోకి మధుగిరి ప్రాంతంలో పుట్టి పెరిగిన అర్జున్.. 1981లో ‘సింహదా మారి సైన్య’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా డెబ్యూ చేశాడు. అయితే.. కెరీర్ ప్రారంభం నుండి ఎక్కువగా యాక్షన్ డ్రామా మూవీస్ చేసేసరికి అర్జున్ కి.. ఫ్యాన్స్ అంతా ‘యాక్షన్ కింగ్’ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు.
అలా 19 ఏళ్లకే హీరోగా జర్నీ స్టార్ట్ చేసిన అర్జున్.. నండ్రి(1984) మూవీతో తమిళంలోకి, మా పల్లెలో గోపాలుడు(1985) సినిమాతో తెలుగులో అడుగుపెట్టాడు. ఇక తెలుగులో డెబ్యూ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న అర్జున్.. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు. తెలుగులో ముఖ్యంగా కోడి రామకృష్ణ, కోదండ రామిరెడ్డి లాంటి అగ్రదర్శకులతో సినిమాలు చేశాడు. దర్శకుడు కోడి రామకృష్ణను గాడ్ ఫాదర్ లా భావించే అర్జున్ కి.. ఆయన దర్శకత్వంలో చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలవడం విశేషం. అదీగాక క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో చేసిన ‘జెంటిల్ మెన్’ సినిమాతో ఒక్కసారిగా అర్జున్ క్రేజ్.. సౌత్ ఇండియాలో పీక్స్ లోకి చేరుకుంది.
ప్రస్తుతం యూత్ కి డైరెక్టర్ శంకర్ క్రేజ్ గురించి కాస్తో కూస్తో తెలుసేమో గానీ.. యాక్షన్ కింగ్ అర్జున్ క్రేజ్ గురించి చాలా తక్కువ తెలుసని చెప్పాలి. ఎందుకంటే.. దర్శకుడు శంకర్ తో అందరు హీరోలు వర్క్ చేయాలని తహతహలాడుతుంటారు. అలాంటిది డైరెక్టర్ శంకరే వరుసగా తన రెండు సినిమాలు అర్జున్ తో చేసి బ్లాక్ బస్టర్స్ కొట్టడం విశేషం. ఆ రెండు సినిమాలు కూడా అప్పట్లోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అన్ని భాషల హీరోలు ఒక్కసారిగా అర్జున్ గురించి.. అతని సబ్జెక్టు సెలక్షన్ చూసి అవాక్కయ్యారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున స్టార్స్ గా ఫామ్ లో ఉన్నప్పుడు కూడా డైరెక్టర్ శంకర్ తో సినిమా చేసే ఛాన్స్ అందుకోలేకపోయారు.
ఈ క్రమంలో హీరోగా తెలుగు హీరోలకు పోటీగా.. తెలుగులో ఉన్న బడా దర్శకులు, నిర్మాతల కాంబినేషన్ లో సినిమాలు చేసి హిట్స్ కొట్టాడు. అయితే.. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఆడియెన్స్ కి అర్జున్ స్టార్డమ్ గురించి పెద్దగా ఐడియా లేదని చెప్పాలి. కేవలం నటుడిగానే కాకుండా అర్జున్.. తన కెరీర్ లో దర్శకుడిగా సుమారు 12 సినిమాలు చేశాడు. అదేవిధంగా ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఎన్నో సినిమాలను తెరపైకి తీసుకొచ్చాడు. ఇన్నేళ్ళ కెరీర్ అర్జున్ ఇప్పటివరకు స్ట్రయిట్ తెలుగు సినిమాను డైరెక్ట్ చేయలేదు. ఇటీవల తన కూతురు ఐశ్వర్యను తెలుగులో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ.. ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ప్లాన్ చేశాడు.
ఇంకా పేరు పెట్టని ఆ సినిమాను తానే నిర్మిస్తుండటమే కాకుండా స్వీయదర్శకత్వంలో తెరకెక్కించనున్నాడు. కొంతకాలంగా హీరోగా సినిమాలు తగ్గించేసిన అర్జున్.. విలన్ రోల్స్ తో మెప్పిస్తున్నాడు. అభిమన్యుడు, హీరో, కడలి లాంటి సినిమాలలో విలన్ గా అలరించాడు. ఇవేగాకుండా శ్రీ మంజునాథ, హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రాచెల్లి లాంటి సినిమాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ గా కొనసాగుతున్నాయి. కెరీర్ లో ఎన్నడూ ఏ వివాదం జోలికి వెళ్లని అర్జున్ పేరు.. ఇటీవల అనౌన్స్ చేసిన కొత్త సినిమా విషయంలో చర్చనీయాంశంగా మారింది. హీరో విశ్వక్ సేన్ తో అనుకున్న సినిమాను వేరే హీరోతో త్వరలో అనౌన్స్ చేయనున్నాడు అర్జున్. చూడాలి మరి పాన్ ఇండియా క్రేజ్ ని 1990లలోనే చూసేసిన హీరో.. దర్శకుడిగా తెలుగులో ఎలాంటి సక్సెస్ కొడతాడో!