మన జీవితాలు సవ్యంగా నడవాలంటే మహిళల గైడెన్స్ చాలా అవసరం. అమ్మ గానో, భార్యగానో, అక్క గానో వాళ్ళు వెనకుండి నడిపిస్తేనే మన బ్రతుకులు ముందుకి సాగుతాయి. మరి జీవితాలనే నడుపుతున్న మహిళలకి రోడ్ పై పెద్ద పెద్ద వాహనాలను నడపడం ఓ లెక్క? ఇప్పుడు ఈ విషయాన్నే నిజం చేసింది యోగితా రఘువంశీ. మహారాష్ట్రలో నందర్భార్ కి చెందిన మహిళా యోగిత. డిగ్రీ చేశాక ఈమె న్యాయ శాస్త్రంలో ఉత్తీర్ణత సాధించింది. ఇక లా ప్రాక్టీస్ సమయంలో ఆమె భర్తని కోల్పోయింది. ఆ సమయంలో ఇంటిని పోషించుకోవాల్సిన బాధ్యత యోగితపై పడింది. జూనియర్ అసిస్టెటెంట్ గా ప్రాక్టీస్ చేస్తుంటే ఆమెకి సంపాదన లేకుండా పోయింది. దీంతో.., లారీ డ్రైవర్ గా కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది యోగిత.
వేల కిలో మీటర్ల ప్రయాణం, ఎలాంటి వాతావరణంలోనైనా డ్రైవింగ్, రోడ్లపై ఒంటరి ప్రయాణం. డాబాల్లో తిండి.., ఎక్కడ పడితే అక్కడ నిద్ర.. మగ వాళ్ళకి సైతం ఇబ్బందికరమైన జీవితం అది. కానీ.., యోగిత ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. హైవే పైనే తన జీవితాన్ని వెతుక్కుంది. తన ఇద్దరు పిల్లలను ఇలా కష్ట పడుతూనే పెంచి పెద్ద చేసింది. యోగిత మొదటిసారిగా బాంబే నుండి అహ్మదాబాద్ కి లోడ్ తీసుకెళ్లింది. టన్నుల కొద్దీ లోడ్. హెవీ వెహికల్. కానీ.., యోగితాకి ఏ మాత్రం కష్టం అనిపించలేదు.
అవలీలగా తన మొదటి ట్రిప్ పూర్తి చేసింది. అక్కడ నుండి యోగితాలో ఆత్మ విశ్వాసం పెరిగిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు యోగితా ఇంటర్నేషన్ ఉమెన్ డ్రైవర్. కాశి నుండి కన్యాకుమారి వరకు ఆమె తిరగని ప్లేస్ లేదు. ఇక తాను లారీ డ్రైవర్ గా ఉన్నా.., ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదట. “తోటి డ్రైవర్స్ నన్ను వాళ్ళ సోదరిగా భావిస్తారు. కనిపించిన ప్రతిసారి ప్రేమగా పలకరిస్తారు. ఎప్పుడైనా టైర్ పంక్చర్ అయితే.., వారే హెల్ప్ చేస్తుంటారు అని యోగిత తెలియచేయడం విశేషం. చదువుకి తగ్గ ఉద్యోగం లేదంటూ.., కష్టానికి తగ్గ జీతం లేదంటూ తెగ బాధ పడిపోయే వారికి యోగితా రఘువంశీ జీవితం ఓ స్ఫూర్తి దాయకం.