ఆటగాళ్లతో పాటు ఐపీఎల్‌కు అదనపు ఆకర్షణ తెస్తున్నారు యాంకర్లు. ఈసారి ఐపీఎల్‌లోనూ ఒక తెలుగందం తనదైన యాంకరింగ్‌తో అదరగొడుతున్నారు.
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా వీక్షిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే ఈసారి మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా సాగుతున్నాయి. దాదాపుగా ప్రతి మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు వెళ్తుండటంతో ఎవరు గెలుస్తారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కొన్ని మ్యాచ్‌లు అయితే ప్రేక్షకులను కాలి మునివేళ్లపై నిల్చోబెడుతున్నాయి. ఉత్కంఠత తారస్థాయికి చేరుకుంటుండటంతో ఐపీఎల్ వ్యూస్ కూడా అదిరిపోతున్నాయి. ప్లేయర్ల ధనాధన్ ఇన్నింగ్స్‌లు, బౌలర్ల మ్యాజిక్‌లతో మ్యాచులు వీక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తున్నాయి. ఆటగాళ్ల ఫీట్లతో పాటు ఐపీఎల్లో ఆకర్షించే మరో విషయం యాంకర్స్. వీళ్లు తమ అందాలతో ఐపీఎల్‌కు మరింత గ్లామర్ అద్దుతుంటారు.
సొగసుతోనే కాదు మాటతీరుతోనూ ఆట గురించి తమదైన స్టైల్లో వివరిస్తూ ప్రేక్షకులకు మరింత ఆసక్తిని పెంచుతుంటారు. పదహారో సీజన్ ఐపీఎల్లో ఒక తెలుగు యాంకర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె మరెవరో కాదు ప్రత్యూష సాధు. మ్యాచ్ సెంటర్లో హోస్టింగ్ చేస్తూ అందంతో పాటు మాటతీరుతో కళ్లు తిప్పుకోకుండా చేస్తున్నారామె. ఈ తెలుగందం క్రికెట్ గురించి మాట్లాడుతుంటే ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రత్యూష గతంలో ‘కాంచనమాల’ అనే సీరియల్లో నటించారు. అలాగే పలు బ్రాండ్ల అడ్వర్టయిజ్‌మెంట్లలోనూ మెరిశారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ తీసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లోనూ ఒక కీలక పాత్రను పోషించారు ప్రత్యూష. క్రికెట్ అంటే పడిచచ్చే ఆమె.. ఐపీఎల్లో తెలుగులో హోస్టింగ్ చేసే ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేశారు. ఐదేళ్ల కిందటే ప్రత్యూషకు పెళ్లయింది. కెరీర్లో ప్రత్యూష ఇంతగా రాణించడం వెనుక ఆమె భర్త ప్రోత్సాహం కూడా ఉంది.